అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రయాణాలకు కాలం కలసిరానట్లుగా కనిపిస్తోంది. సోమవారం రోజు అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా ఆరిజోనాలోని స్కాట్‌డేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేటు జెట్ విమానాలు ఢీకొన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు లియర్ జెట్ 35ఏ విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఈక్రమంలోనే రన్ వేపై దిగుతుండగా.. విమానం జారింది. ఈక్రమంలోనే రన్ వేపై ఉన్న మరో బిజినెస్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ జీ200ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
విషయం గుర్తించిన విమానాశ్రయ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. క్షతగాత్రులను కూడా అదే ఆస్పత్రికి పంపించారు. అలాగే ప్రమాదం వల్ల విమానాశ్రయంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆపై ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
ఇదంతా ఇలా ఉండగా.. గత పది రోజుల్లో అమెరికాలో విమాన ప్రమాదం సంభవించడం ఇది నాలుగోసారి. జనవరి 29వ తేదీ రోజు వాషింగ్టన్ డీసీ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌర విమానం.. గాల్లో ఉండగానే ఢీకొన్నాయి. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. రెండూ కింద ఉన్న పొటామాక్ నదిలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన మూడు రోజులకే ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో మరో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
ఇది జరిగిన మరో నాలుగు రోజుల్లోనే అలస్కాలో ఓ విమానం అదృశ్యం అయింది. బేరింగ్ ఎయిర్ సంస్థకు సెప్నా 208బీ గ్రాండ్ కారవాన్ మోడన్ విమానం గత శుక్రవారం గల్లంతు కాగా.. ఈ విమాన శకలాలను ఓ సముద్రంలో గుర్తించారు. అయితే ఇందులో ఓ పైలెట్ సహా మరో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. ఇలా వరుస ప్రమాదాలు సంభవిస్తుండడంతో.. అమెరికా ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
![]() |
![]() |