రెండ్రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి.. అగ్రరాజ్యం అధ్యక్షుడు ఆతిథ్యం ఇచ్చారు. గురువారం రోజు మోదీ అక్కడకు చేరుకోగా స్వయంగా ట్రంప్‌యే వచ్చి ఘన స్వాగతం పలికారు. ఆపై మోదీతో భేటీ అయ్యారు. ఈక్రమంలోనే ఆప్యాయంగా హత్తుకుంటూ.. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మోదీ కోసం ఓ ప్రత్యేక బహుమతిని అందజేశారు. దానిపై "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్" అంటూ రాసి స్వహస్తాలతో ట్రంప్ సంతకం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10వ తేదీ రోజు విదేశీ పర్యటనకు వెళ్లారు. ముందుగా ఫ్రాన్స్ వెళ్లిన ఆయన అక్కడే రెండ్రోజుల పాటు ఉన్నారు. ఆపై 13వ తేదీ రోజు అంటు గురువారం రోజు అమెరికాకు వెళ్లారు. ఈక్రమంలోనే అక్కడి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అధికారులు ఆయనను నేరుగా బ్లేయర్ హౌస్‌కి తీసుకు వెళ్లారు. అక్కడే మోదీకి బస ఏర్పాటు చేయగా.. శుక్రవారం రోజు ఉదయం శ్వేత సౌధానికి వెళ్లారు. అక్కడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు.
మోదీని చూసిన వెంటనే ట్రంప్ ఆయన వద్దకు వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నారు. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను మిత్రమా అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ తన స్నేహితుడైన మోదీకీ ప్రత్యేక బహుమతి అందజేశారు. తానే స్వయంగా రాసిన "అవర్ జర్నీ టుగెదర్" అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఈ పుస్తకం మొదటి పేజీలోనే "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్" అంటూ రాసి కింద సంతకం చేశారు.
ఈ పుస్తకంలో మోదీతో ట్రంప్ దిగిన ఫొటోలు ఉన్నాయి. 2019లో మోదీ అమెరికాలో పర్యటించగా.. "హౌడీ మోడీ" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఇద్దరు నేతలు కలిసి దిగిన ఫొటోలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే ఆ తర్వాత ఏడాది ట్రంప్ భారత దేశానికి రాగా.. "నమస్తే ట్రంప్" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పుస్తకంలో ఉంచారు. ఈ ఫొటోలు అన్నింటిని ట్రంప్ దగ్గరుండి మోదీకి చూపించగా.. ప్రధాని చాలా సంతోష పడిపోయారు.
ఈ సందర్భంగానే ట్రంప్ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ.. భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చాలా కాలం నుంచి మోదీ తన స్నేహితుడు అని తమ మధ్య మంచి అనుబంధం ఉందన్నారు. అలాగే మోదీ కూడా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి తాను ఓ మంచి విషయం నేర్చుకున్నానని చెప్పారు. అదే దేశ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం అని వివరించారు.
![]() |
![]() |