ఇటలీకి చెందిన సౌండ్ సిస్టం.. విదేశీ సాంకేతిక నిపుణులతో ఆడియో, వీడియో వ్యవస్థ.. 100 అడుగుల దూరంలో ఉన్న వారికి, కిలోమీటరు దూరం నుంచి చూసే వారికి ఒకే విధంగా కనిపించేలా వేదిక.. జనసేన ఆవిర్భావ సభావేదిక ప్రత్యేకతలు ఇవీ. అంతర్జాతీయ స్థాయిలో చేసిన ఈ ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన బైట్‌గ్రాఫ్ ప్రొడక్షన్స్ సంస్థ అధునాతన హంగులతో వేదికను తీర్చిదిద్దింది. 12 రోజులు 470 మంది సాంకేతిక నిపుణులు కష్టపడి 120 అడుగుల వెడల్పున వేదికను నిర్మించారు. ఇటలీ నిపుణులను రప్పించి సౌండ్‌సిస్టం ఏర్పాటు చేయించారు. ఎంత దూరం నుంచి చూసినా వేదికపై ఉన్న వారు స్పష్టంగా కనిపించేలా లైటింగ్, స్పష్టంగా వినిపించేలా సౌండ్ సిస్టంతో పాటు 23 ఎల్ఈడీ వాల్స్, 15 ఎల్ఈడీ స్ర్కీన్స్ ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, గత అధ్యక్షులు క్లింటన్, బుష్ తదితరుల సభలకు, అలాగే ప్రధాని మోదీ అమెరికా సభకు, అక్కడ జరిగే నాటా, ఆటాలతో పాటు మన దేశంలోని 23 రాష్ట్రాలకు చెందిన వారి అసోసియేషన్లు నిర్వహించే సభలకు రెండున్నర దశాబ్దాలుగా బైట్‌గ్రాఫ్ ఏర్పాట్లు చేస్తోంది. ఆ సంస్థకు తెలుగు వ్యక్తి ప్రశాంత్ కొల్లిపర సీఈవోగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో ఆయన ఇక్కడకు వచ్చారు. జనసేన తరఫున తనను సంప్రదించినప్పుడు జనసేన పండుగలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చానన్నారు.
![]() |
![]() |