పోటీ ప్రపంచంలో బతకలేరని కన్న పిల్లల్ని ఓ తండ్రి క్రూరంగా చంపేశాడు. ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని వారిని బలిగొన్నాడు. అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.హోలీ పండగనాడు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్.. కాకానాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. అతనికి భార్య తనూజ, జోషిల్ (7), నిఖిల్ (6) ఉన్నారు. ఉద్యోగ రీత్యా తోటసుబ్బారావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. జోషిల్ ఒకటో తరగతి చదువుతుండగా, నిఖిల్ యూకేజీ చదువుతున్నాడు.హోలీ సందర్భంగా భార్యా, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. భార్యను అక్కడే ఉండమని, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి పది నిమిషాల్లో వస్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. పిల్లలిద్దరి కాళ్లూ చేతులు కట్టి.. బాత్రూం బకెట్లలో నీటిలో వారిని ముంచి, ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం తానూ బెడ్రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎంతకూ భర్త రాకపోవడంతో.. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వచ్చింది. కిటికీలోంచి చూడగా.. కిశోర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూస్తే, పిల్లలిద్దరూ బకెట్‌లో తలలు మునిగిపోయి విగతజీవులుగా ఉన్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, దీంతో వారిని చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్లు బంధువులు తెలిపారు. కాగా, తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడేమీ కాదని మృతుడి సోదరుడు వెల్లడించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
![]() |
![]() |