గాజాలో కాల్పులు విరమణ మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. రెండు నెలల తర్వాత గాజాపై ఇజ్రాయేల్ విస్తృత దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఖ్య 200 వరకు ఉంటుందని నివేదికలు వస్తున్నాయి. జనవరి 19న గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున టెల్ అవీవ్ దాడులు చేయడం ఇదే మొదటిసారి. ఓవైపు కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరుగుతుండగానే.. ఇజ్రాయేల్ దుందుడుకు చర్యలకు పాల్పడింది. ఉత్తర గాజా, డేర్ అల్ బల్హ్, ఖాన్ యూనిస్, రఫా సహా గాజాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయేల్ జరిపిన వైమానిక దాడుల్లో 66 మంది ప్రాణాలు కోల్పోగా.. 150 మంది గాయపడ్డారని రెస్క్యూలో పాలొన్న సంస్థలు వెల్లడించాయి.
‘గాజా స్ట్రిప్‌లోని హమాస్‌కు చెందిన ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా విస్తృత దాడులు జరుపుతున్నాం’ అని ఇజ్రాయేల్ సైన్యం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బంధీల విడుదలకు హమాస్ నిరాకరించడంతో పాటు అమెరికా అధ్యక్షుడు ప్రతినిధి స్టీవే విట్కాఫ్ ఇతర మధ్యవర్తుల ప్రతిపాదనలను హమాస్ తోసిపుచ్చడంతోనే దాడులకు ఆదేశించినట్టు ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. గాజా స్ట్రిప్ వ్యాప్తంగా ఉన్న హహస్ ఉగ్రవాద సంస్థ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేస్తోందని పేర్కొంది.
హమాస్‌కు వ్యతిరేకంగా సైనిక శక్తిని ఇజ్రాయేల్ పెంచబోతుందని పేర్కొన్నారు. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పూర్తి బాధ్యత నెతన్యాహుదేనని హమాస్ మండిపడింది. ఈ ఉల్లంఘన గాజాలోని బందీల విధిని సంక్లిష్టం చేసిందని స్పష్టం చేసింది. అయితే, గాజాపై దాడికి ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి ఇజ్రాయేల్ సమాచారం ఇచ్చిందని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇదిలా ఉండగా తొలిదశ కాల్పుల విరమణను పొడిగించాలని ఇజ్రాయేల్.. రెండో దశ ఒప్పందం చేసుకోవాల్సిందేనని హమాస్ పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 2న చర్చలు మొదలయ్యాయి. కానీ, ఈ చర్చల్లో ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారు. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత 33 మంది ఇజ్రాయేలీలు, ఐదుగురు థాయ్ పౌరులు సహా 38 మంది బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయేల్ 2,000 మంది పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి విడుదల చేసింది. ఇంకా హమాస్ వద్ద 59 మంది బందీలుగా ఉన్నారు. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై తక్షణమే చర్చలు ప్రారంభానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తే అమెరికన్-ఇజ్రాయేల్ సైనికుడు ఎడాన్ అలెగ్జాండర్, మరో నలుగురు బందీల మృతదేహాలను అప్పగించడానికి సిద్ధమేనని గతవారం హమాస్ ప్రకటించింది. అయితే, దీనిని ఇజ్రాయేల్ తోసిపుచ్చింది.
![]() |
![]() |