టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు మళ్లీ పుట్టుకొచ్చాయి. గత సీజన్‌లోనూ ఇదే తరహా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎంఎస్‌డీకి ఇదే ఆఖరి సీజన్ అంటూ పుకార్లు పుట్టించారు. అందుకే కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడంటూ ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఐపీఎల్ 18వ సీజన్‌కి సిద్ధమయ్యాడు మహేంద్రుడు. అయితే, ఇప్పుడు మళ్లీ ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతాడని గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా అలాంటిదేమీ ఉండదని స్పష్టం చేశాడు. ఇక తాజాగా తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను స్వయంగా ధోనీనే ఖండించాడు. తాను వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే.. ఫ్రాంచైజీనే లాక్కెళ్లిపోతుందని వ్యాఖ్యానించాడు. ఎన్నాళ్లు ఆడాలనుకుంటే అంతకాలం ఆడతానని క్లారిటీ ఇచ్చాడు. "సీఎస్‌కే ఇది నా ఫ్రాంచైజీ. చెన్నై తరఫున మరింత కాలం ఆడాలనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే నన్ను లాక్కెళ్లిపోతారు" అని ఎంఎస్‌డీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. కాగా, ఇవాళ ముంబయి ఇండియన్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
![]() |
![]() |