సాధారణంగా ఎక్కువ పొడవుగా ఉండటాన్ని మంచి ఆరోగ్యవంతమైన లక్షణంగా భావిస్తుంటారు. పొడవుగా ఉన్నవారికి మంచి గుర్తింపు కూడా ఉంటుంది. అయితే పొడవుగా ఉన్నవారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులోనూ కొన్ని రకాల కేన్సర్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. పొడుగ్గా ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. పొడుగ్గా ఉండే వారిలో కొన్ని రకాల కేన్సర్లు ఎక్కువగా కనిపిస్తుండటాన్ని చాలా అధ్యయనాలు తేల్చాయని ప్రపంచ కేన్సర్ రీసెర్చ్ ఫండ్ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. ఆయా వ్యక్తుల్లో జన్యువులు, తీసుకునే పోషకాహారం, వారి ఎదుగుదల పరిస్థితి వంటివి దీనికి కారణమని పేర్కొంది. ఎంత ఎక్కువ పొడవు ఉంటే వారిలో అంత ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్న కొన్ని కేన్సర్ల వివరాలు వెల్లడించింది.పొడవు ఎక్కువగా ఉన్నవారిలో పాంక్రియాటిక్ కేన్సర్, లార్జ్ బొవెల్ కేన్సర్, యుటెరైన్ కేన్సర్, ఒవేరియన్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కిడ్నీ కేన్సర్, స్కిన్ కేన్సర్ (మెలనోమా), బ్రెస్ట్ కేన్సర్ వంటివి ఎక్కువ పొడవు ఉన్నవారిలో కనిపించే అవకాశం ఉందని ప్రపంచ కేన్సర్ రీసెర్చ్ ఫండ్ నివేదిక తెలిపింది. పొడవుగా ఉండేవారిలో జన్యువులు, చిన్నప్పటి నుంచీ మంచి పోషకాహారం తీసుకోవడం వంటి ప్రభావం చూపిస్తాయి. వారి శరీరంలో ఇన్సూలిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వారి కాలేయంలో, పొట్టలో కొవ్వు చాలా తక్కువగా ఏర్పడుతుంది. ఈ క్రమంలో వారికి మధుమేహం (షుగర్) వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అంతేకాదు గుండె జబ్బులు కూడా తక్కువే.చిన్నప్పటి నుంచీ వేగంగా ఎదిగే క్రమంలో పొడవుగా ఉండేవారి శరీర కణాల విభజన, రిపేరింగ్ వేగంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని కణాలు అసంబద్ధంగా విభజన జరిగి, కేన్సర్లకు దారి తీసే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పొడవుగా ఉండేవారు కొన్ని రకాల లక్షణాలేమైనా తమలో కనిపిస్తున్నాయా అన్నది గమనించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం, తరచూ నీరసం, చర్మం రంగు, తీరులో మార్పులు, మొటిమలు ఏర్పడటం, రక్తస్రావం ఎక్కువగా జరుగుతుండటం, శరీరంలోని ఏవైనా భాగాల్లో విపరీతమైన నొప్పి వస్తుండటం వంటివి గుర్తించి... వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.ప్రపంచ కేన్సర్ రీసెర్చ్ ఫండ్ నివేదికలోని అంశాల ఆధారంగా అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు ఇవి. ఎక్కువ పొడవుగా ఉన్నంత మాత్రాన కేన్సర్ బారినపడతారన్నది కచ్చితం కాదు. ఆయా వ్యక్తుల శరీరం తీరు, జన్యువులు, జీవనశైలి, ఆహారం, అలవాట్లు వంటి ఎన్నో అంశాలు కేన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపుతుంటాయి. అందువల్ల ఏ సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించి, తగిన మందులు వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
![]() |
![]() |