సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోరు చేసి.. తర్వాత రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేసింది. 44 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో తొలుత ఇషాన్ కిషన్ సెంచరీతో (47 బంతుల్లో 106; 11 ఫోర్లు , 6 సిక్సర్లు), హెడ్ హాఫ్ సెంచరీతో (31 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కూడా మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా.. తీక్షణ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చి.. ఐపీఎల్‌లో చెత్త రికార్డు నమోదు చేశాడు.
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. సంజూ, ధ్రువ్ పోరాడినా.. ఆఖర్లో హెట్మయర్, శుభమ్ దూబే చెలరేగినా.. లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 242/6 కు పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సిమర్‌జీత్ సింగ్ 3 ఓవర్లలో 46 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షల్ 4 ఓవర్లలోకేవలం 34 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, జంపా తలో వికెట్ తీశారు. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 60 రన్స్ ఇచ్చాడు.
భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్‌కు సరైన ఆరంభం దక్కలేదు. 24 పరుగులకే ఆ జట్టు యశస్వీ జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4) వికెట్లు చేజార్చుకుంది. నితీశ్ రాణా కూడా 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతే మరోసారి విధ్వంసం మొదలైంది. ఓపెనర్ సంజూ శాంసన్‌కు జత కలిసిన.. ధ్రువ్ జురెల్ భారీ సిక్సర్లతో ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. సంజూ (37 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), జురెల్ (35 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు కేవలం 9.5 ఓవర్లలోనే 111 పరుగులు జోడించారు. ఇక్కడే సంజూ, ధ్రువ్ 3 బంతుల వ్యవధిలో పెవిలియన్ చేరగా.. స్కోరు బోర్డు నెమ్మదించింది. ఇక ఆఖర్లో హెట్మెయర్ (23 బంతుల్లో 42 రన్స్; 1 ఫోర్, 4 సిక్సర్లు); శుభమ్ దూబె (11 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడినా కొండంత లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో పరుగులకే పరిమితమైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు అదిరే ఆరంభం దక్కింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఫరూకీ ఓవర్లో హెడ్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టగా.. తీక్షణ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24) అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఆరంభం నుంచి ఆర్ఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు హెడ్ కూడా అదే జోరు కొనసాగించాడు. జోఫ్రా ఓవర్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. పవర్ ప్లే సమయానికి జట్టు స్కోరు 94/1 గా ఉంది. అప్పుడే పరుగుల వేగం కాస్త నెమ్మదించింది.
పదో ఓవర్లో హెడ్ అవుట్ కాగా.. తర్వాత ఇషాన్ కిషన్.. నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 30), క్లాసెన్‌తో కలిసి (14 బంతుల్లో 33) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ఇషాన్ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్‌కు కూడా భారీ స్కోరు అందించి.. విజయానికి బాటలు వేశాడు.
![]() |
![]() |