ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 ఫోర్లు.. 4 సిక్సర్లు.. 16 బంతుల్లోనే జోఫ్రా హాఫ్ సెంచరీ

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 08:02 PM

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చేతులెత్తేశారు. సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసానికి తలొంచారు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ రెండో అత్యధిక స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో 286 రన్స్ చేసిన హైదరాబాద్.. తమ పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డుకు (287 vs RCB) ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. థర్డ్ హైయెస్ట్ కూడా హైదరాబాద్ పేరిటే ఉంది. గతేడాది ముంబైపై 277 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ టీంలో ఈ ఏడాదే వచ్చిన ఇషాన్ కిషన్.. సెంచరీతో విరుచుకుపడగా.. హెడ్ కూడా 67 రన్స్ చేశాడు. క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కూడా ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.


ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో ఇంకా 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. తన స్పెల్‌లో కేవలం ఒకే డాట్ బాల్ వేశాడు. ఈ క్రమంలోనే కేవలం 16 బంతుల్లోనే 50 రన్స్ ఇవ్వగా.. ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆర్చర్ చేసినట్లు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.


గతంలో ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్) పేరిట ఉండేది. 2024 సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో .. మోహిత్ 4 ఓవర్లలో 73 రన్స్ ఇచ్చాడు. తర్వాత బాసిల్ థంపి ఉన్నాడు.


ఐపీఎల్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చింది వీళ్లే..


జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్)- 0/76 vs సన్ ‌రైజర్స్ హైదరాబాద్ (2025 మార్చి 23, హైదరాబాద్)


మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)- 0/73 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2024, ఢిల్లీ)


బాసిల్ థంపి (సన్ రైజర్స్ హైదరాబాద్)- 0/70 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2018, బెంగళూరు)


యశ్ దయాల్ (గుజరాత్ టైటాన్స్)- 0/69 vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2023, అహ్మదాబాద్)


రీస్ టోప్లే (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 1/68 vs సన్ రైజర్స్ హైదరాబాద్ (2024, బెంగళూరు)


ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్లో హెడ్ 4 ఫోర్లు, ఒక సిక్స్ బాది వైడ్ సహా 23 పరుగులు పిండుకున్నాడు. తన రెండో ఓవర్లో 12 పరుగులు ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషన్ 3 సిక్సర్లు బాదగా.. 22 రన్స్ వచ్చాయి. తన నాలుగో ఓవర్లో క్లాసెన్ 3 ఫోర్లు బాదగా.. ఇషాన్ కిషన్ ఓ బౌండరీ బాదాడు. ఇంకా నో బాల్, బైస్ 4 సహా మొత్తం 23 రన్స్ వచ్చాయి. ఇలా మొత్తంగా బైస్ తీసేస్తే 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.


RR బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మాత్రమే 50 కంటే తక్కువ పరుగులు ఇచ్చాడు. మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ ఐపీఎల్‌‌కు ముందు జరిగిన వేలంలో రాయల్స్.. జోఫ్రాను ఏకంగా రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. అయితే తన తొలి మ్యాచ్‌లోనే ధారాళంగా పరుగులు ఇచ్చి చెత్త రికార్డు నమోదు చేశాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com