భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై (క్యాష్ విత్‌డ్రా) ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలను పెంచింది. దీనితో.. 2025, మే 1 నుంచి భారతదేశంలో ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. తరచుగా ఏటీఎంలు ఉపయోగించే వినియోగదారులపై ఈ మార్పు ప్రభావం చూపుతుంది. ఈ ఛార్జీల పెరుగుదల వల్ల క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం మరింత ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుందని డీడీ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది. ఒక బ్యాంకు కస్టమర్లకు ఏటీఎం సేవలను అందించినందుకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీనే ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటారు. బ్యాంకులు ఈ ఛార్జీలను వినియోగదారులకు వారి బ్యాంకింగ్ రుసుముల్లో భాగంగానే విధిస్తాయి.
ఉదాహరణకు ఇక్కడ మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ అనుకోండి. మీ బ్యాంకు అందించే ఉచిత ట్రాన్సాక్షన్స్ పరిమితి అయిపోయి లేదా దగ్గర్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం లేనప్పుడు.. ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి ట్రాన్సాక్షన్ జరిపారు. అప్పుడు మీరు చేసిన అధిక లావాదేవీపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేస్తుంది. ఇలాగే అన్ని బ్యాంకులకు కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు.
ఆర్బీఐI వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఈ ఫీజుల్ని సవరించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆర్బీఐకి విజ్ఞప్తి చేయడంతో తాజా ప్రకటన వచ్చింది. అంటే.. ఇక్కడ ఈ ఇంటర్‌ఛేంజ్ ఫీజు అనేది.. మీరు ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ఆర్థిక లావాదేవీలపై రూ. 19, ఆర్థికేతర లావాదేవీలపై రూ. 7 చొప్పున వసూలు చేస్తారు. గతంలో ఇది వరుసగా రూ. 17, రూ. 6 గా ఉండేది.
ఇక్కడ ఆర్థిక లావాదేవీలు అంటే క్యాష్ విత్‌డ్రా ఉంటుంది. ఆర్థికేతర లావాదేవీలు (నాన్ ఫైనాన్షియల్ ఛార్జీలు) అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి ఉంటాయి. చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఈ ధరల పెరుగుదల ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ బ్యాంకులు ఏటీఎం మౌలిక సదుపాయాలు, సేవల కోసం పెద్ద ఆర్థిక సంస్థలపై ఆధారపడతాయి.
2014, అక్టోబర్ 10 నాటి ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో 5 ఉచిత లావాదేవీల నుంచి మూడుకు తగ్గించారు. ఈ మూడు లావాదేవీలలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండూ ఉంటాయి. ఈ నిబంధన మెట్రో నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో వర్తిస్తుంది. ఇతర ప్రాంతాల్లో మాత్రం ఉచిత లావాదేవీల పరిమితి ఐదుగా ఉంది. నెలలో ఈ పరిమితి దాటితే ఇంటర్‌ఛేంజ్ రుసుములు వర్తిస్తాయన్నమాట.
2019, ఆగస్టు 14 నాటి ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం, సాంకేతిక కారణాల వల్ల లావాదేవీ విఫలమైతే, వాటిని ఉచిత లావాదేవీలుగా పరిగణించరు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో డబ్బు లేకపోవడం, పిన్ నంబర్ సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల లావాదేవీ విఫలమైతే ఛార్జీలు విధించరు.
![]() |
![]() |