2025 ఆర్థిక సంవత్సరం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. మార్కెట్ ఒడుదొడుకులు ఉన్నప్పటికీ కొన్ని పథకాలు మంచి రాబడిని అందించాయి. వాటిల్లో మిరే అసెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్, ఎఫ్ఓఎఫ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫండ్.. ఏడాదిలోనే ఏకంగా 102.63 శాతం రాబడితో 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ టాప్ మ్యూచువల్ ఫండ్ పథకంగా నిలిచింది. మూడంకెల రాబడిని అందించిన ఏకైక పథకం ఇదే కావడం విశేషం. మిరే అసెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్-ఆఫ్-ఫండ్ స్కీమ్. ఇది ప్రధానంగా మిరే అసెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ యూనిట్లలో పెట్టుబడి పెడుతుంది.
పెట్టుబడి పరంగా చూసినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1న నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ ప్రారంభించిన వారికి.. రూ. 1.84 లక్షల రాబడి వచ్చింది. ఈ క్రమంలోనే ఏడాదిలోనే పెట్టుబడి రూ. 1.20 లక్షలు పోను.. రూ. 64 వేల ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 120.29 శాతంగా ఉంది.
పైన చెప్పుకున్నది సిప్ పరంగా అయితే.. ఇప్పుడు లంప్‌సమ్ పరంగా రిటర్న్స్ చూద్దాం. 2024, ఏప్రిల్ 1న ఒకేసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు రూ. 2.02 లక్షలు వచ్చాయి. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన 102.62 శాతం వృద్ధి నమోదు చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ రూ. 1.02 లక్షల ప్రాఫిట్ వచ్చిందన్నమాట. సిప్ కంటే లంప్ సమ్‌తోనే ఏడాది వ్యవధిలో మంచి లాభాలు వచ్చాయన్నమాట.
ఇక ఈ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (నికర ఆస్తుల విలువ-ఏయూఎం) 2024 ఏప్రిలలో రూ. 72.50 కోట్లుగా ఉండగా.. ఈ ఫిబ్రవరిలో రూ. 102.93 కోట్లకు పెరిగింది. ఏకంగా 42 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. ఈ స్కీమ్ 2021, డిసెంబర్‌లో ప్రారంభమైంది. హ్యాంక్ సెంగ్ టెక్ టీఆర్ఐ.. ఈ పథకానికి కొలమానంగా ఉంది. ఈ ఫండ్ మేనేజర్లుగా ఏక్తా గాలా, విశాల్ సింగ్ ఉన్నారు. చైనా టెక్నాలజీ రంగం పుంజుకోవడం వల్ల ఈ పథకం మంచి పనితీరు కనబరిచిందని నిపుణులు అంటున్నారు.
చైనా ప్రభుత్వం నుంచి పాలసీ మద్దతు లభించడం, డిజిటల్ ఎకానమీపై నియంత్రణ సడలింపు, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలపై ఇన్వెస్టర్ల నమ్మకం పెరగడం వంటివి దీనికి దోహదపడ్డాయి అని ఫిస్‌డమ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సాగర్ షిండే అన్నారు. ఇంకా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ స్కీమ్ అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. కనీసం రూ. 5 వేలతో ఇందులో చేరొచ్చు. ఇక సిప్ అయితే కనీసం రూ. 99 నుంచే ఇన్వెస్ట్ చేయొచ్చని చెబుతున్నారు.
![]() |
![]() |