షుగర్ వచ్చిందంటే చాలా సమస్యగా ఉంటుంది. దీనిని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో రకాల మెడిసిన్స్ వాడతారు. వాటి కారణంగా షుగర్ అంత త్వరగా తగ్గదు. ప్రతి సమస్యకి ఆహారమే పరిష్కారం. మనం ఆహారాన్ని సరిగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అదే సరిగా తీసుకోకపోతే అదే సమస్యగా మారుతుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. ఇక మంచి ఆహారం తీసుకుంటేనే మనకి దీర్ఘకాలిక సమస్య అయిన షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. సాధారణంగా షుగర్ ఉన్నవారు ఫుడ్స్‌ని గబగబా తినొద్దు. అదే విధంగా, తినే ఆహారం కూడా సరైనవి తీసుకోవాలి. పప్పులు, కాయధాన్యాలవంటివి తీసుకోవాలి. అప్పుడే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యం సరిగా ఉంటుంది.
షుగర్ కంట్రోల్ అయ్యేందుకు
డయాబెటిస్ అనేది చాలా సాధారణమైన పరిస్థితి. ఈ సమస్య వచ్చిందంటే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు షుగర్‌తో బాధపడుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, చక్కెర స్థాయిలు తగ్గడం, పెరగడం చాలా సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని పప్పులు చిక్కుళ్ళు తీసుకోవడం చాలా ముఖ్యం.
అధ్యయనం ప్రకారం
పప్పులు తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, ఫాస్టింగ్ బ్లడ్‌లో గ్లూకోజ్ గణనీయంగా తగ్గాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అంతగా ఎఫెక్ట్ చేయవు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే ఫుడ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గడానికి, టైప్ 2 డయాబెటిక్ రోగులలో గ్లైసెమిక్ కంట్రోల్ చేయడానికి దారితీసింది.
షుగర్ ఉన్నవారికి పప్పులు
అన్ని పప్పులు, చిక్కుళ్ళు చాలా హెల్దీ. వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నవారికి మంచివి మాత్రమే కాదు, గుండె సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. డయాబెటిక్‌తో బాధపడేవారు ఆహారంలో సహజంగానే పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా, సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. షుగర్ ఉన్నవారు ఫుడ్ తీసుకునేటప్పుడు పప్పులు, చిక్కుళ్ళు తీసుకోవడం ముఖ్యం. అలాంటి పప్పుల గురించి తెలుసుకోండి.
పెసలు
50 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఏ ఫుడ్ అయిన కూడా షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. పెసల్లో 38 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి కారణంగా దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. వీటితో తయారుచేసిన ఫుడ్స్ ఏవైనా కూడా షుగర్ ఉన్నవారికి చాలా మంచివి. పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
శనగపప్పు
శనగపప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచి ఫుడ్. ఈ పప్పులో ప్రోటీన్, ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని హై ఫైబర్ కంటెంట్ మీ బ్లడ్‌లో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. వాటిని కంట్రోల్ చేస్తుంది. గుండెకి కూడా చాలా మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండి, సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. ఎర్ర రక్తకణాల ఏర్పాటుకి హెల్ప్ చేస్తుంది.
బీన్స్
శనగలు, కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 40 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫుడ్స్ గ్లూకోజ్ లెవల్స్‌ని పెద్దగా ఎఫెక్ట్ చేయవు. శనగలు ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి చాలా మంచి ఫైబర్ ఫుడ్. ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే శనగల్లో విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. మీరు షుగర్‌తో బాధపడుతుంటే శనగల్ని ఎక్కువగా తినండి. షుగర్ ఉన్నవారు షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే పప్పులు, చిక్కుళ్ళు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
![]() |
![]() |