పొదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం అనేదే ఆర్థిక నిర్వహణ అని చాలామంది అనుకుంటారు. కానీ, నిజంగా ఆర్థిక నిర్వహణ అంటే ‘పొదుపు, మదుపుతో పాటు భవిష్యత్తులో వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండటం, అప్పులు లేకుండా సుస్థిరంగా జీవించడం’ అని చెప్పాలి. ప్రతి రూపాయి మన ఖాతాలోనే ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అప్పుల భారాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఈ అప్పులు ఎలా తగ్గించుకోవాలనేది మనం చూద్దాం.
అప్పులు ఎలా తగ్గించుకోవాలి?
అప్పుల జాబితా తయారు చేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న రుణాలను పూర్తిగా అర్థం చేసుకోవడం మొదటి స్థాయి. వాటి వడ్డీ రేట్లు, కనీస చెల్లింపులు, గడువు తేదీలను లెక్కించండి. అధిక వడ్డీ ఉన్న అప్పులను తొలుత తీర్చుకోవాలని ప్రణాళిక వేయండి. చిన్న అప్పులను తొలగించటం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఒకటి మించి లోన్లు నిర్వహించడం క్లిష్టతరం కావచ్చు. అధిక వడ్డీ ఉన్న రుణాలన్నింటినీ కలిపి తక్కువ వడ్డీకి మారిస్తే మంచిది. ఒకే రుణంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. క్రెడిట్ స్కోరు బాగుంటే తక్కువ వడ్డీ రుణాలు పొందొచ్చు. ప్రస్తుత గృహరుణాన్ని తక్కువ వడ్డీకి మార్పు చేయడం ప్రయోజనకరం.
రుణ వాయిదాలను ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుములు పడతాయి. వాయిదా ఆలస్యమైతే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. సమయానికి కార్డు బిల్లులను చెల్లించండి.
నెలవారీ ఖర్చులను గమనిస్తూ, బడ్జెట్‌ను అనుసరించండి. అవసరానికి మించి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడండి.
అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి. ఇంటి నుంచి అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడం వల్ల అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఉద్దేశించిన కాలానికి ముందే రుణాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించండి.
గృహ రుణంపై ఆదా ఎలా చేసుకోవచ్చు?
మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల వ్యవధికి 8.5 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. దీనికి నెలకు రూ.43,391 వాయిదా చెల్లించాలి. 20 ఏళ్లకు మొత్తం వడ్డీ రూ.54,13,878 అవుతుంది. కానీ, ఏడాదికొకసారి రూ.50 వేల చొప్పున అదనంగా చెల్లిస్తే, మొత్తం వడ్డీ రూ. 42,06,044 అవుతుంది. అంటే ఇక్కడ రూ.12,07,834 ఆదా అవుతుంది.
50 శాతం మించకుండా ఖర్చులను నియంత్రించండి..
ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం, మీ నికర ఆదాయంలో నెలవారీ వాయిదాలు 50 శాతం మించకూడదు. ఈ పరిమితి దాటితే గందరగోళం ఏర్పడుతుంది.
ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను వెతకండి. బడ్జెట్‌ను కట్టుదిట్టంగా పాటించండి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మంచి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. తగిన ప్రణాళిక, పట్టుదలతో అప్పుల ఊబిలో పడకుండా.. ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. అప్పులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. అధిక వడ్డీ రుణాలను తొలగించడం, ఆదాయాన్ని పెంచుకోవడం, పొదుపును అలవర్చుకోవడం ద్వారా ఆర్థిక భద్రతను సాధించవచ్చు.
![]() |
![]() |