రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పనితీరుపై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వైసీపీ నేత సాకే శైలజానాథ్ స్పందిస్తూ.... రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ యంత్రాంగం మీద న్యాయవ్యవస్థ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో కీలకమైన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం బాధాకరం. ఒకే కంటెంట్ ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావొచ్చేమోకానీ, పలుచోట్ల ఎఫ్ఐఆర్‌లు కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన సూచనలు పోలీస్ యత్రాంగం పట్టించుకోవడం లేదు. అరెస్ట్ చేయొద్దని చెప్పినా, పీటీ వారెంట్ పేరుతో అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఒక ప్రణాళిక బద్ధంగా పైనుంచి వచ్చిన నాయకుల సూచనలను పోలీసులు పాటిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఒకానొక సందర్భంలో డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చే దాకా తెచ్చుకోవడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. కోర్టు సీసీ టీవీ ఫుటేజీలు అడిగితే కోతులు కొరికేశాయని చెప్పుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి అని అన్నారు.
![]() |
![]() |