డిగ్రీ విద్యలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను(టూ మేజర్) బోధించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో అప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. ఒకే సబ్జెక్టు(సింగిల్ మేజర్)కు డిగ్రీని కుదించారు. అయితే.. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపడంతోపాటు ఒకే సబ్జెక్టులో పాఠ్యాంశాలను(సిలబస్) భారీగా పెంచడంతో అధ్యాపకుల కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన సింగిల్ మేజర్ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది. మూడు వారాల్లోగా డిగ్రీ విధానంలో మార్పులపై నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. రెండు ప్రధాన సబ్జెక్టులతో కూడిన ‘టూ మేజర్’ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన మార్పులను సూచించాలని స్పష్టం చేసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచే టూ మేజర్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జూలైలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా కొత్త పాఠ్యాంశాల ప్రణాళికకు తుది రూపం ఇవ్వాలని కూడా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. అలాగే 2024-25లో డిగ్రీలో చేరిన విద్యార్థులు ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంలో ఉండగా, వారిని కూడా రెండు ప్రధాన సబ్జెక్టుల విధానంలోకి మార్చే అవకాశాలపై దృష్టి సారించింది.
![]() |
![]() |