ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీగిరి క్షేత్రం కన్నడిగులతో కిక్కిరిసింది. తమ ఆడపడుచైన భ్రమరాంబ అమ్మవారికి చీరసారెను సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ పాదయాత్రికులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో బుధవారం శ్రీశైల క్షేత్రవీధులన్ని రద్దీగా దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి క్యూలైన్లలో కన్నడ భక్తులు బారులుతీరారు. ఉత్సవాలో భక్తుల తాకిడి దృష్ట్యా నేటి నుంచి గర్భాలయంలో అర్జితసేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేసి అలంకరణ దర్శనంమాత్రమే కల్పిస్తున్నారు. దీంతో వచ్చే భక్తులు మూడు క్యూలైన్ల ద్వారా అలంకారణ దర్శనమే చేసుకోవడం వల్ల దర్శనాలు వేగంగా కొనసాగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు దేవస్థానం సిబ్బంది, శివసేవకులు నిరంతరం తాగునీరు, అల్పహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా లడ్డూ కౌంటర్ల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడిగినన్ని లడ్డూలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం, వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ చోట్ల వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు.
![]() |
![]() |