రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అమ్మకాల ద్వారా కొంత ఊరట పొందాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని తిమ్మినాయుడుపాళెంలోని సెంట్రల్ గోదాములో ఉన్న 5,300 టన్నుల్లో 905.71 టన్నులకు గురువారం ప్రపంచస్థాయి(గ్లోబల్)లో వేలం వేసేందుకు సిద్ధమైంది. తద్వారా దాదాపు రూ.200 కోట్లు చేకూర్చుకోవచ్చని ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. గత ఏడాది నవంబరులో నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు స్పందన కరువైంది. కరోనా కారణంగా చైనాలో ఎర్రచందనం ఆధారిత పరిశ్రమలు మూతపడడంతో చందనం కొనుగోలు దారులు పెద్దగా స్పందించలేదు. తాజాగా ఎర్రచందనంతో తయారు చేసే వస్తువుల ఉత్పత్తి పరిశ్రమలు పుంజుకుంటున్న నేపథ్యంలో దాదాపు 905.71 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎర్రచందనం దుంగలను 3 గ్రేడ్లుగా విభజిస్తారు. ఎలాంటి వంపులు లేకుండా నిటారుగా ఉన్న, చేవ(నాణ్యత) కలిగిన ఎర్రచందనాన్ని ‘ఏ గ్రేడ్’గా పరిగణిస్తారు. ఇది దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వయసున్న వృక్షాల ద్వారానే లభ్యమవుతుంది. ఎర్రచందనం కాండం(మొదలు) సైజును బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు. దీనికన్నా తక్కువ నాణ్యత ఉన్న దాన్ని ‘బీ గ్రేడ్’గా పరిగణిస్తారు. వంపులు తిరిగి చేవ తక్కువగా ఉన్న దానిని ‘సీ గ్రేడ్’గా లెక్కిస్తారు. ఆయా దుంగల నాణ్యత, వయసు ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గత నెల 28న నిర్వహించాల్సిన ఎర్రచందనం గ్లోబల్ టెండర్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించనున్న టెండర్లలో ఏ గ్రేడ్ ఎర్రచందనం 10, బీ గ్రేడ్ 10 దుంగలు, సీ గ్రేడ్ 30 దుంగలను విక్రయించనున్నారు.
![]() |
![]() |