నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు NPCI అదేశాలు జారీ చేసింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్ కీలకం కావడంతో మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది.
ఎందుకు ఈ మార్పు?
UPIకి లింక్ చేసిన ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్‌ల వల్ల భద్రత లోపిస్తుంది. సాధారణంగా, ప్రజలు తమ మొబైల్ నంబర్‌లను మార్చినప్పుడు లేదా పాత నంబర్‌ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు & కానీ ఆ నంబర్‌లు లింక్ చేసిన UPI ఖాతాలు యాక్టివ్‌గానే ఉంటాయి. అలాంటి నంబర్‌లు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఉపయోగించని మొబైల్ నంబర్‌ను సదరు టెలికాం కంపెనీ వేరే కొత్త వినియోగదారుకు కేటాయించినట్లయితే, UPI లావాదేవీలు ఆ నంబర్ ద్వారా జరుగుతాయి. అంటే, యూపీఐ లావాదేవీ డబ్బులు కొత్త వ్యక్తి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి నంబర్‌ల వల్ల మోసాలు పెరుగుతాయి. ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్‌లు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే ప్రమాద తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఇలాంటి రిస్క్‌లకు అడ్డుకట్ట వేయడానికి, బ్యాంకులు & చెల్లింపు సేవా ప్రదాతలు (PSPలు) MNRLను ఉపయోగించి వారి డేటాబేస్ రికార్డులను అప్‌డేట్ చేస్తుంటాయి. దీనివల్ల, నిష్క్రియాత్మక నంబర్‌లను గుర్తించి డేటాబేస్ రికార్డుల నుంచి తొలగించడానికి వీలవుతుంది.
ఎలాంటి నంబర్లను ఇన్‌యాక్టివ్‌గా గుర్తిస్తారు?
సాధారణంగా, గత 90 రోజులుగా ఎలాంటి కాల్స్, మెసేజ్‌లూ రాని ఫోన్ నంబర్లను ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్‌గా పరిగణిస్తారు. అలాంటి నంబర్‌లతో లింక్ అయిన యూపీఐ సేవలు ఏప్రిల్ 01 నుంచి ఆగిపోతాయి.
![]() |
![]() |