ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నా..: ప్రియాంక గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 07:34 PM

తానిప్పుడు మలయాళం భాష నేర్చుకుంటున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని సూచన మేరకే తాను ఈ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీచర్‌ను పెట్టుకుని మరీ.. మలయాళ భాష గురించి తెలుసుకుంటున్నానని వివరించారు. ఇప్పుడిప్పుడే తనకు కొంత వరకు భాష అర్థం అవుతుందని, అలాగే మాట్లాడ గల్గుతున్నానని వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


వయనాడ్ వడక్కనాడ్ ప్రాంతంలోని గిరిజన స్థావరంలో జరిగిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన నానమ్మ, దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి గిరిజన సమాజం పట్ల ఎంతో గౌరవం ఉండేదని గుర్తు చేసుకున్నారు. గిరజనుల ఎలా సామరస్యంగా జీవిస్తారో, అడవిని, నీటిని ఎలా గౌరవిస్తారో ఆమె తమకు చెప్పేదని తెలిపారు. అలాగే గిరిజన సమాజం నుంచి ఆమెకు ఏమైనా బహుమతులు వచ్చినప్పుడల్లా ఆమె దాన్ని ఇంట్లో సురక్షితంగా పెట్టేవారని పేర్కొన్నారు. ఇప్పుడు మ్యూజియంగా ఉన్న ఆమె ఇంటికి వెళ్తే.. ఆ వస్తువులన్నీ మీరు ఇప్పుడు కూడా చూడొచ్చని చెప్పారు.


తన నానమ్మ ఎప్పుడూ తమకు గిరిజన ప్రజలను చూసి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించేవారని ప్రియాంగ గాంధీ పేర్కొన్నారు. అలాగే వయనాడ్ ప్రజలు తాగునీరు, రోడ్డు సమస్యల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని.. వాటిని పరిష్కరించేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో తరచుగా మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సమస్యలపై మరోసారి తాను సంబంధిత మంత్రులను కలిసి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈక్రమంలోనే ప్రజల కష్టాలు పూర్తిగా అర్థం చేసుకోవడానికి తాను మలయాళ భాష నేర్చుకుంటున్నట్లు చెప్పారు.


వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని తనతో మాట్లాడుతూ.. నియోజక వర్గ ప్రజలకు దగ్గరవ్వాలంటే కచ్చితంగా వారి మాతృ భాష నేర్చుకోవాలని సూచించినట్లు చెప్పారు. ప్రజల బాధలు, కష్ట సుఖాలు అర్థం చేసుకోవడానికి భాష ఎంత అవసరమో తనకు అప్పుడే అర్థం అయింది.. అప్పుడే భాష నేర్చుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఎక్కువ ఆలస్యం చేయకుండా అప్పటి నుంచే తాను ఓ టీచర్‌ను పెట్టుకుని మరీ మలయాళం నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు కొంత వరకు మలయాళం వస్తుందని.. చిన్నగా మాట్లాడం చేస్తున్నానని చెప్పారు. ఎవవరైనా మాట్లాడితే సులువుగా అర్థం అవుతందున్నారు. చూడాలి మరి ప్రియాంక గాంధీ ఎంత త్వరగా పూర్తి భాషను నేర్చుకంటారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com