ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం.. తమిళనాడుతో పెట్టుకోవద్దు.. విజయ్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 07:34 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తమిళ వెట్రి కజగమ్ (టీవీకే) అధినేత, ఇళయదళపతి నటుడు విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే, మోదీ రహస్య మిత్రులని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉన్నా.. బీజేపీతో వారికి లోపాయికారీ ఒప్పందం ఉందని విజయ్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన టీవీకే తొలి సర్వసభ్య సమావేశంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా డీలిమిటెషన్, త్రిభాషా విధానం పేరుతో హిందీని బలవంతంగా రుద్దడం, జీఎస్టీ వసూళ్ల పంపిణీలో వ్యత్యాసం, మహిళలపై నేరాలు, జమిలీ ఎన్నికల ప్రణాళిక తదితర అంశాల్లో కేంద్రాన్ని తూర్పారబట్టారు. సినిమా స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చిన టీవీకే అధినేత ‘గాలిని ఆపాలనుకుంటే.. తుఫానుగా మారుతుంది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.


‘మిస్టర్ ప్రధాన మంత్రి తమిళనాడుతో జాగ్రత్తగా వ్యవహరించండి.. మా రాష్ట్రం అనేక ఉమ్మడి ఒప్పందాలకు వేదిక.. మేము విభజన శక్తులకు వ్యతిరేకం, సోదరభావం, సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం నిలబడతాం’ అని విజయ్ స్పష్టం చేశారు. గతేడాది రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకే పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డీఎంకే, బీజేపీలపై తరుచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ‘హిందీ వివాదంపై డీఎంకే, మోదీలు డ్రామాలు ఆడుతున్నారు.... ఒకరు పాట పాడితే.. ఇంకొకరు డ్యాన్సు చేస్తున్నారు.. ఇరువురూ తోడు దొంగలు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


అలాగే, తమిళనాడులో ద్విభాషా విధానం కొనసాగించాలని విజయ్ డిమాండ్ చేశారు. అలాగే, దేశంలో ముస్లిం ఆస్తుల నిర్వహణను నియంత్రించే వక్ఫ్ చట్టంలో సవరణలపై కూడా సవాళ్లు విసిరారు. గతేడాది వక్ఫ్ చట్టంలో సవరణలను చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మోదీ సర్కారు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలోని సభ్యులు 23 ప్రతిపాదనలు చేయగా.. 14 వాటికి మాత్రమే ఆమోదం తెలిపి.. బడ్జెట్ సమావేశాల ముందే స్పీకర్‌కు సమర్పించారు. తాజాగా, ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని విజయ్ పార్టీ తీర్మానం చేసింది.


కాగా, వచ్చే ఏడాది మార్చిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) అధినేత, నటుడు విజయ్ ఏడాది ముందే సమర శంఖారావం పూరించారు. టీవీకే వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 26న మహాబలిపురంలో భారీ బహిరంగ సభను విజయ్ నిర్వహించారు. . ఈ సభలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేశారు. తమ పార్టీకి ఆయన వచ్చే ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేస్తున్నట్టు విజయ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com