ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మయన్మార్‌లో మృత్యువిలయం: 1000 దాటిన మృతులు.. భారత్ నుంచే తొలిసాయం

international |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 09:45 PM

నిమిషాల వ్యవధిలోనే సంభవించిన ఆరు భారీ భూకంపాలు మయన్మార్‌లో పెను విధ్వంసం సృష్టించాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటి వరకూ 1000 మంది మృతిచెందారని.. దాదాపు 2,400 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. భూప్రకంపనలకు భయపడిపోయిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌ను సైతం భూకంపం వణికించింది. రాజధాని బ్యాంకాక్‌లో రిక్టర్ స్కేలుపై 6.4, 7.3 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చింది. భూకంపం ప్రభావం భారత్‌ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ కనిపించింది. పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10 మంది చనిపోగా.. 100 మందికిపైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.


అంతర్యుద్ధం కారణంగా మయన్మార్‌లో సైనిక పాలన కొనసాగడంతో అత్యవసర సేవలు తీవ్ర బలహీనమయ్యాయి. దీంతో విపత్తును సమర్ధంగా నిర్వహించడానికి అవి సన్నద్ధంగా లేవు. పశ్చి మండేలాలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని స్థానికులు, ఎమర్జెన్సీ వర్కర్లు బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సగైంగ్ పట్టణంలో ఇర్రావడ్డీ నదిపై 100 ఏళ్ల కిందట నిర్మించిన అవా వంతెన ధ్వంసమైంది. ఈ కష్టకాలంలో తమకు అంతర్జాతీయ సాయం కావాలని సైనిక ప్రభుత్వ అధినేత అంగ్ హ్లాంగ్ అభ్యర్ధించారు. ఏ దేశమైనా.. ఏ అంతర్జాతీయ సంస్థ సహకారం అందజేయాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.


మయన్మార్‌ పరిస్థితికి చలించిపోయిన భారత్.. అండగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూకంపం సృష్టించిన విధ్వంసం ఆందోళన కలిగిస్తోందని, అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ తెలిపారు. వీలైనంత మేర సాయం చేస్తామని మాటిచ్చిన మోదీ.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన మయన్మార్‌కు టెంట్లు, బ్లాంకెట్స్, వాటర్ ప్యూరిఫైర్లు, అత్యవసర ఔషధాలు సహా 15 టన్నుల రిలీఫ్ సామాగ్రిని భారత వైమానిక దళ విమానంలో ఆ దేశానికి పంపారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాలు సాయానికి ముందుకొచ్చాయి. మయన్మార్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆ దేశానికి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రకటించారు.


అటు, థాయ్‌లాండ్‌లో భూకంప తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆ దేశ ప్రధాని షినవత్ర అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. కాగా, థాయ్‌లాండ్‌లో ఉండే భారతీయులు ఎవరూ గాయపడలేదని అక్కడ భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉండగా, మయన్మార్‌లో తరుచూ భూకంపాలు చోటుచేసుకోడానికి సగాయింగ్ ఫాల్డ్ కారణమని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com