ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొలకెత్తిన పెసలు ఏ సమయంలో తింటే బరువు తగ్గుతారో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 11:26 PM

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు అయితే, బరువు తగ్గడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.


అధిక బరువు వల్ల శారీరక రూపం ప్రభావితం అవ్వడమే కాకుండా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రావచ్చు. బరువు తగ్గడం కోసం ప్రతి ఒక్కరూ కఠినమైన వ్యాయామాలు చేయకపోయినా సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అధిక బరువును నియత్రించుకోవచ్చు. కొన్ని ఆహారాల్ని తినడం ద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన పెసలతో బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన పెసల్ని ఎప్పుడు ఎలా తింటే బరువు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం.


ఊబకాయానికి పెసర పప్పు


​పెసర పప్పు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే పెసర పప్పులో తక్కువ కేలరీలు ఉంటాయి. దీంతో పెసలు తినడం వల్ల శరీర బరువు పెరగదు. అంతేకాకుండా పెసల్లో ఉండే ప్రోటీన్, ఇతర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. అలాగే, పెసర పప్పులో మంచి మొత్తంలో ఫైబర్ కనిపిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో సాయపడుతుంది. బరువు తగ్గడానికి మొలకెత్తిన పెసర పప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లోనే మొలకెత్తిన పెసల్ని ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో తినాలో చుద్దాం.


మొలకెత్తిన పెసల్ని ఎలా చేసుకోవాలి?


* ముందుగా పెసర పప్పును బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఒక పాత్రలో గుప్పెడు పెసర పప్పు తీసుకుని.. నీటితో శుభ్రంగా కడిగి.. 6-8 గంటలు నీటిలో నానబెట్టండి


* పెసరపప్పును 6 నుంచి 8 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత దానిని వడకట్టి.. వాటి నుంచి పూర్తిగా నీటిని తొలగించాలి. ఇప్పుడు పెసరపప్పును వేరు చేసి ఒక పాత్రలో ఉంచండి.


* ఆ తర్వాత పెసర పప్పును శుభ్రమైన కాటన్ గుడ్డలో ఉంచి దానిని కప్పండి. ఆ తర్వాత జల్లెడలో కప్పి 12-14 గంటలు అలాగే ఉంచండి. ఈ సమయంలో పెసర పప్పు మొలకెత్తే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పెసర పప్పులో చిన్న మొలకలు కనిపిస్తే అవి తినడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం.


* మొలకెత్తిన పెసర పప్పును మీరు డైరెక్ట్‌గా తినవచ్చు. లేదా వాటికి నిమ్మరసం, నల్ల ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసి సలాడ్‌లా తినవచ్చు.


మొలకెత్తిన పెసర పప్పు తినడం వల్ల లాభాలు


* బరువు తగ్గవచ్చు - మొలకెత్తిన పెసర పప్పులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మొలకెత్తిన పెసర పప్పు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది.


* జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది - మొలకెత్తిన పెసర పప్పు జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది. ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.


* శరీరానికి బలం, శక్తిని అందిస్తుంది - మొలకెత్తిన పెసర పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల్ని బలోపేతం చేయడంలో సాయపడుతుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.


* టాక్సిన్స్ బయటకు - మొలకెత్తిన పెసర ప్పు తినడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది.


* మహిళలకు వరం - మొలకెత్తిన పెసర పప్పు మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి సాయపడుతుంది. రుతుక్రమ సమస్యల్ని తగ్గిస్తుంది.


ఎప్పుడు తినాలో తెలుసా?


ఉదయం ఖాళీ కడుపుతో మొలకెత్తిన పెసర పప్పు తినడం మంచిది. దీంతో, రోజు ప్రారంభంలో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. శరీరం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. మొలకెత్తిన పెసర పప్పు మంచి ప్రోటీన్ మూలం. ఇది కండరాల పెరుగుదలకు సాయపడుతుంది. మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.


ఇవి కూడా ముఖ్యం


* మొలకెత్తిన పెసర పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.


* దీంతో పాటు సమతుల్య ఆహారం కూడా ముఖ్యం.


* వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి.


* శరీరానికి తగినంత నీరు అవసరం. రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి.


* ఇవన్నీ ఫాలో అయితే శరీరం మెరుగైన ఆకృతిలో, ఆరోగ్యంగా మారుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com