భార్య, అత్తింటివారు తనను తీవ్రంగా కొట్టి హింసిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో చోటుచేసుకుంది. భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అతడు దీనంగా వేడుకున్నాడు. తనను భార్య కొడుతున్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియో క్లిప్‌ను ఈ సందర్భంగా పోలీసులకు అందజేశాడు. భార్య బాధిత భర్త తాలూకు వీడియో క్లిప్ బయటకు రావడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... మార్చి 20న భర్త లోకేశ్‌ను భార్య హర్షిత రైక్వార్ దారుణంగా కొట్టింది. తనను కొట్టొద్దని చేతులు జోడించి అతడు వేడున్నప్పటికీ ఆమె కనికరించలేదు. మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు. లోకేశ్ చెంపలు వాయించడంతో పాటు ముఖంపై కాలితో తన్నింది. కాలర్ పట్టుకుని పలుమార్లు కొట్టడం వీడియోలో చూడొచ్చు. కాగా, పేద కుటుంబానికి చెందిన హర్షిత రైక్వార్‌ను తాను ఎలాంటి కట్నం తీసుకుకోకుండా 2023 జూన్‌లో పెళ్లి చేసుకున్నట్లు లోకేశ్ తెలిపాడు. అయితే, పెళ్లి తర్వాత నుంచి భార్య, అత్త, బావమరిది డబ్బులు, బంగారు నగలు కావాలని తనను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. తాను ఇవ్వలేనని చెప్పడంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. ఇక మార్చి 20 సంఘటన తర్వాత లోకేశ్... సత్నా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య వేధింపుల గురించి నిజాన్ని బయటపెట్టడానికి తన ఇంట్లో కెమెరాను ఏర్పాటు చేసుకున్నానని అతను వెల్లడించాడు. భార్య చిత్రహింసల నుంచి తనను కాపాడాలని లోకేశ్ పోలీసులను వేడుకున్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు. నెట్టింట వైరలవుతున్న లోకేశ్ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
![]() |
![]() |