రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండగా.. గురువారం పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల కూడా వర్షం కురిసింది. దీంతో వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు.. ఇప్పుడు కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతూ ఉండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు గురువారం సాయంత్రం హెచ్చరించింది. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉరుములతో వర్షం కురిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.
మరోవైపు కడపలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా 38, 39 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడిన ప్రజలు.. భారీ వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏకధాటిగా 45 నిమిషాల పాటు భారీ వర్షం కురవడంతో కడప రోడ్లపై వర్షం నీరు వచ్చి చేరింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి. భారీ వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ప్రజలు భావిస్తున్నారు.
అటు కృష్ణా జిల్లా గన్నవరం పరిసరాల్లోనూ గురువారం వర్షం కురిసింది. దాదాపు అరగంట సేపు వర్షం పడింది. దీంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడిన జనం.. వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలోనూ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ వర్షాలు కురుస్తున్నాయి.
![]() |
![]() |