తమిళ సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. సుదీర్ఘ చర్చల అనంతరం నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ వివాదాస్పద బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీవీకే పార్టీ కూడా తన వైఖరి వెల్లడించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టేందుకు టీవీకే ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా నిరసనలను సమర్థవంతంగా నిర్వహించాలని అధినేత విజయ్ తన పార్టీ జిల్లా కార్యదర్శులకు సూచించారు.వక్ఫ్ సవరణ బిల్లు-2025 రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ప్రతిపాదించిన సవరణలన్నీ వాయిస్ ఓటు ద్వారా తిరస్కరించబడ్డాయి. ఎన్డీయే ఈ బిల్లు మైనారిటీ వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించామని సమర్థించుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు దీనిని 'ముస్లిం వ్యతిరేకం' అని విమర్శించాయి. ప్రభుత్వం లౌకిక విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించాయి.భారతదేశంలో మైనారిటీలు మెరుగైన రక్షణ లభిస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వాదించారు. "ప్రపంచంలో భారతదేశం కంటే సురక్షితమైన ప్రదేశం మైనారిటీలకు మరొకటి లేదు. భారతదేశంలో మెజారిటీ ప్రజలు పూర్తిగా లౌకికవాదులు కాబట్టి, మైనారిటీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ పొందుతున్నారు" అని మంత్రి రిజిజు చర్చ సందర్భంగా అన్నారు.
![]() |
![]() |