అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ, అమెరికా సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో స్పష్టం చేయాలన ఆయన కోరారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చైనా మన దేశానికి చెందిన 4 వేల కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని ఆక్రమించిందని, దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజింగ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసిందని ఆయన అన్నారు. ఆక్రమిత భూభాగాన్ని త్వరగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అక్కడి రాయబారి ద్వారా వెలుగులోకి వచ్చిందని తెలిపారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రతిస్పందించారు. ఏ ప్రభుత్వ హయాంలో చైనా ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుందో అందరికీ తెలుసని అన్నారు. డోక్లాం ఘటన జరుగుతున్న సమయంలో బీజింగ్ అధికారులతో కలిసి ఎవరు సూప్ తాగారో కూడా తెలుసని ఠాకూర్ విమర్శించారు. ఇలాంటి అంశాలను రాజకీయం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, గతంలో జరిగిన తప్పిదాలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని నిలదీశారు.
![]() |
![]() |