అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా సుంకాల భారం చైనాపై ఎక్కువగా పడుతోంది. దీనివల్ల భారతీయ ఎగుమతులకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చైనాపై అమెరికా సుంకాలు 65% లేదా అంతకంటే ఎక్కువ ఉండగా, భారత్‌పై సుంకాలు 27% మాత్రమే ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరింత గిరాకీ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం ముఖ్యంగా సాంకేతిక ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు వంటి రంగాల్లో భారత్ దూసుకుపోయే అవకాశం ఉంది. ఈ విషయంపై ఈవై ఇండియా ట్రేడ్ పాలసీ లీడర్ అగ్నేశ్వర్ సేన్ మాట్లాడుతూ, ఇతర ప్రాంతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపే రంగాలలో భారతదేశానికి పోటీతత్వం పెరిగే అవకాశం ఉంది అన్నారు. అంతేకాకుండా, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సప్లై చెయిన్ వ్యవస్థలను పునర్నిర్మించాలని, ఆసియాలోని ఎఫ్ టీఏ భాగస్వాములతో సహకరించాలని సూచించారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 10 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. రాబోయే సంవత్సరాల్లో పాలసీ మద్దతు, అనుకూల పన్ను విధానం ఉంటే ఈ సంఖ్య 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఐసీఈఏ అంచనా వేసింది.భారత్, అమెరికా మధ్య సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారత ఎలక్ట్రానిక్స్ వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తక్కువ ధర కలిగిన కార్ల విభాగంలో భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగం అమెరికా మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉందని ఈవై ఇండియా పార్టనర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు.2023లో చైనా ఆటో మొబైల్, విడిభాగాల ఎగుమతులు 17.99 బిలియన్ డాలర్లుగా ఉండగా, భారత్ ఎగుమతులు 2.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని మరింత మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.అమెరికా సుంకాల నేపథ్యంలో చైనాకు ఎదురుదెబ్బ తగలడం, భారత్‌కు కలిసిరావడం అనేది ఆర్థికంగా ఒక ముఖ్య పరిణామం అని... దీనిని సద్వినియోగం చేసుకుంటే, భారతీయ ఎగుమతులు కొత్త శిఖరాలను అధిరోహించగలవని నిపుణులు పేర్కొన్నారు.
![]() |
![]() |