ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే నోటి నుంచి అల్లు అర్జున్ డైలాగ్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 08:25 PM

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే పుష్ప డైలాగ్‌తో అధికార పార్టీ ఎంపీకి కౌంటర్ ఇవ్వడం సభలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ తనపై చేసిన విమర్శలకు దీటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే సినిమాటిక్‌ స్టైల్‌లో గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. గురువారం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే.. వక్ఫ్‌ భూమిని కబ్జా చేశారంటూ అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడిన మల్లికార్జున ఖర్గే.. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయంగా తనపై చేసే దాడులకు తాను ఎప్పుడూ బెదిరిపోనని చెబుతూ.. పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్‌ చెప్పడంతో సభలోని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.


 వక్ఫ్‌ సవరణ బిల్లును బుధవారం లోక్‌సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ ప్రసంగిస్తూ.. మల్లికార్జున ఖర్గేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారహితంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా వక్ఫ్ భూములను కబ్జా చేశారంటూ మల్లికార్జున ఖర్గేపై ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.


ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ విషయాన్ని మల్లికార్జున ఖర్గే లేవనెత్తారు. తనపై అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని.. తమ పార్టీ ఎంపీలు ఆయన వ్యాఖ్యలను ప్రశ్నించడంతో వెంటనే ఆయన ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. అయితే జరగాల్సిన నష్టం అంతా అప్పటికే జరిగిపోయిందని తెలిపారు. సోషల్ మీడియా, మీడియాల్లో బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలే వైరల్‌ అవుతున్నాయని వెల్లడించారు. అందుకే తాను అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను ఖండించాల్సి వస్తోందని తెలిపారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు గానూ సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఖర్గే డిమాండ్‌ చేశారు.


ఈ సందర్భంగా ఖర్గే తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. తన జీవితం తెరిచిన పుస్తకమని.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని.. అయినప్పటికీ ప్రజా జీవితంలో తలెత్తుకుని నిలబడినట్లు చెప్పారు. అలాంటి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను అనురాగ్ ఠాకూర్‌ నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. లేదంటే ఆయనకు పార్లమెంట్‌లో ఉండే అర్హత లేదని.. రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఇలాంటి రాజకీయ దాడులతో బీజేపీ నేతలు తనను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. గుర్తుంచుకోండి.. తాను ఎవరికీ భయపడనని.. తలొగ్గనని ఖర్గే తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com