వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని అన్నారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా కూతురు సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని షర్మిల అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనే భయం తమలో ఉందని చెప్పారు. ఇటీవల తనకు కొన్ని విషయాలు తెలిశాయని... అవి తనను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు విషయాలను పేర్కొందని షర్మిల తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ పిలిపించుకుని బెదిరించినట్టు అఫిడవిట్ లో ఉందని... తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు ఉందని చెప్పారు. అవినాశ్ బెయిల్ పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగినప్పుడు ఘటనాస్థలిలో ఉన్నది అవవినాశ్ రెడ్డేనని చెప్పారు.
![]() |
![]() |