డోనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్ సూచీలను కుదిపేసింది. భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కాగా... ట్రంప్ చర్యల కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు తీవ్రంగా ఉండటంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగారు. వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలను విధించడంతో వాణిజ్య యుద్ధం మొదలవుతుందనే భయంతో పాటు ఆర్థిక మాంద్యం వస్తుందనే ఆందోళనలు కూడా ఎక్కువయ్యాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది.ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో డౌజోన్స్ సూచిక 1500 పాయింట్లకు పైగా నష్టపోయి 40,665 వద్ద ట్రేడ్ అవుతోంది. నాస్డాక్ దాదాపు 5 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పి 500 సూచిక 4 శాతం వరకు పతనమైంది. వాల్ స్ట్రీట్ కు వెన్నెముకగా ఉన్న ప్రధాన కంపెనీల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి.నైకీ షేర్లు 12 శాతం పతనమయ్యాయి. యాపిల్ షేర్లు కూడా 9 శాతం నష్టపోయాయి. ఐఫోన్ తయారీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే భయంతో యాపిల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. 2020 తరువాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి.చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ చిప్ ల తయారీ కోసం ప్రధానంగా తైవాన్ పై ఆధారపడటంతో షేర్లు పతనమవుతున్నాయి. మెటా, టెస్లా, అమెజాన్ వంటి ఇతర ప్రధాన కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.ట్రంప్ సుంకాల ప్రభావం క్రిప్టోకరెన్సీ మార్కెట్ పై కూడా పడింది. బిట్ కాయిన్ 5 శాతం పతనమై 81,843 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఎథీరియం 7 శాతం, సోలానా 13 శాతం మేర నష్టపోయాయి.
![]() |
![]() |