గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కాదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందానుకునే సంపన్నుల కోసం గోల్డ్ కార్డును ట్రంప్ తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డు కొన్న వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యంగా రష్యా, భారత్ కు చెందిన సంపన్నులు ఈ కార్డులను భారీ సంఖ్యలో కొనుగోలు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ఈ కార్డు ఫస్ట్ లుక్ ను ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్డుపై ట్రంప్ ముఖచిత్రం ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్డ్ పై 'ట్రంప్ కార్డ్' అని రాసి ఉంది. ట్రంప్ సంతకం కూడా కార్డుపై ఉంది. అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడుతూ గోల్డ్ కార్డును ట్రంప్ చూపించారు. ఈ కార్డును 5 మిలియన్ డాలర్లతో ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలి కార్డును తానే కొనుగోలు చేశానని... రెండో కార్డును ఎవరు కొంటారో తెలియదని చెప్పారు.ఈ కార్డును 'ట్రంప్ కార్డుగా' ఆయన అభివర్ణించారు. 'ఈ కార్డు ఏమిటో మీకు తెలుసా? ఇది గోల్డ్ కార్డు. ట్రంప్ కార్డు' అని చెప్పారు. 5 మిలియన్ డాలర్లు మీ వద్ద ఉంటే... ఈ కార్డు మీదే అని వ్యాఖ్యానించారు. రెండు వారాల్లోగా ఈ కార్డు అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
![]() |
![]() |