పార్టీని నమ్మి తాను చాలా నష్టపోయానని, అడుగడుగునా అవమానాలు ఎదుర్కున్నానని, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, ఇక తనవల్ల కాదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తెలుగుదేశం ఐటీడీపీ కమిటీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ సెల్ఫీ వీడియో పోస్టు చేసి ఆత్మహత్యకు యత్నించారు. పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషమే తప్ప మరేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పార్టీలో కలకలం రేపింది.అన్నమయ్య జిల్లా నీరుగట్టువారిపల్లెకు చెందిన వేల్పుల వెంకటేశ్ ఇటీవల రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, పార్టీ నాయకులు సహకరించకపోవడంతో స్నేహితుల వద్ద వాపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన నిన్న ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భార్య, పిల్లలతో కలిసి వెంకటేశ్ ఇటీవల మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ సమస్యల గురించి విన్నవించారు. పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ ఆయనకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది. చికిత్స పొందుతున్న వెంకటేశ్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పరామర్శించారు. వైద్య ఖర్చులు తాను భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి, కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు.వెంకటేశ్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ స్పందించారు. వెంకటేశ్ ఆత్మహత్యాయత్నం తనను కలచివేసిందని, కార్యకర్తలు ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. కార్యకర్తల సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెంకటేశ్ చికిత్సకు అయ్యే ఖర్చును ఐటీడీపీ భరిస్తుందని, ఆయన కుటుంబ సంక్షేమం బాధ్యత తనదేనని లోకేశ్ ఎక్స్ ద్వారా తెలిపారు.
![]() |
![]() |