అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న సుంకాలు అన్ని దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ టారిఫ్ ల గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ట్రంప్ టారిఫ్ ల ప్రభావం ఏపీపై కూడా ఉందని, రాష్ట్రంలో ఆక్వా రంగం దెబ్బతినే స్థితికి వచ్చిందని అన్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు అన్నారు. పేదల సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లను ఇస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే జాతి బాగుపడుతుందని చెప్పారు. ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండటానికి వీల్లేదని అన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని సూచించారు. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారని... ఇప్పుడు పీ4తో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అమరావతి, పోలవరం పూర్తి చేస్తామని... సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు. మొన్నటి వరకు రోడ్లు ఎలా ఉన్నాయో... ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని అన్నారు. తాను ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తుంటే వైసీపీ వాళ్లు వాటిని పాడు చేయడమే కాక పంపులు, స్టార్టర్లు ఎత్తుకెళుతున్నారని మండిపడ్డారు. వీళ్ల ఆలోచన మారాలని చెప్పారు.
![]() |
![]() |