సమాజానికి ఏదైనా మంచి చేసినప్పుడు తృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుర్తింపు, గౌరవం కావాలని కొందరు అనుకుంటుంటారు డబ్బుతో ఎప్పుడూ గౌరవం రాదు సమాజానికి మంచిపని చేస్తేనే గౌరవం, గుర్తింపు లభిస్తుంది అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో 41 పేద కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజా వేదిక సభలో బంగారు కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్గదర్శి గోగినేని రవిచంద్రను సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ‘మార్గదర్శి-బంగారు కటుంబం’ ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చాయి. పేదరికం వెంట తెచ్చుకుంటే వచ్చేది కాదు. కొందరు తరతరాలు పేదరికంలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. పీ4 ద్వారా పేదలకు సహకారం అందుతుంది. భారతరాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు ఆ రోజుల్లో బరోడా మహారాజు ఆర్థిక సహకారం అందించారు. లండన్ వెళ్లి చదువుకోవడానికి చేయూతనిచ్చారు. దేశం మెచ్చుకునే మేధావిగా అంబేద్కర్ తయారయ్యారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి వెనక కూడా అయ్యంగార్ ఉన్నారు. కలాంను అయ్యంగార్ శిష్యుడిగా దగ్గరకు తీసుకుని గణితం, సైన్స్ నేర్పించి శాస్త్రవేత్త అవ్వడానికి సాయపడ్డారు. వివేకానందను రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దారు అని సీఎం వివరించారు.స్వాతంత్ర్య సమరయోధులు గాంధీ అయినా, ఎన్టీఆర్, మోదీ, నేను చిన్న కుటుంబాల్లోనే పుట్టాం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంచలంచెలుగా ఎదిగాం. మీ పిల్లలు కూడా ఇదే విధంగా పైకి రావాలి. అందుకే ఈ పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేద కుటుంబాలను పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పీ4 తెచ్చాం. ఈ గ్రామంలో గుర్తించిన 41 బంగారు కుటుంబాలతో పాటు ఎవరైనా బంగారు కటుంబంలో చేరే వారికి అవకాశం కల్పిస్తాం. బాగా చేసిన మార్గాదర్శులను గౌరవించి, సన్మానిస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు
![]() |
![]() |