అంతరించిపోయిందని భావించిన ఎగిరే ఉడుతను హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం లాహౌల్-స్పితి జిల్లాలోని మియార్ లోయలో గుర్తించింది. దీని శరీరం అంతా ఉన్ని బొచ్చుతో మెత్తగా ఉంటుంది. ఈ అరుదైన ఉడుత కెమెరాలకు చిక్కినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కెమెరా ట్రాపింగ్ సర్వేలో ఈ అరుదైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. వాయవ్య హిమాలయాలకు చెందిన ఎగిరే ఉడుత (యూపెటౌరస్ సినేరియస్) చివరిసారిగా 1994లో కనిపించింది. ఆ తర్వాత అది అంతరించిపోయిందనే భావించారు. మళ్లీ ఇన్నాళ్లకు కనిపించడంతో జీవశాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది.దీని ఉనికిని రాష్ట్రంలో గుర్తించడం అనేది వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తామని హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.భారతదేశంలో మంచు చిరుతపులి జనాభా అంచనా (SPAI) కార్యక్రమంలో భాగంగా ట్రాప్ కెమెరాలు అమర్చగా... వాటిలో ఎగిరే ఉడుత విజువల్స్ రికార్డయ్యాయి. మియార్ లోయలోని వ్యూహాత్మక ప్రాంతాలలో 62 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF)తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.స్పితిలోని కిబ్బర్ నుండి వచ్చిన స్థానిక యువకుల బృందం 2010 నుంచి సంరక్షణ ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. వీరు హిమాలయ పర్వత ప్రాంతాలలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎగిరే ఉడుతతో పాటు, కెమెరా ట్రాప్‌లు మంచు చిరుతపులి, ఎర్ర నక్క, హిమాలయ తోడేలు, కొండ ముంగిస వంటి ఇతర కీలక జాతుల ఫొటోలను కూడా నమోదు చేశాయి. ఈ జంతువులను రాతి కొండ ప్రాంతాలలో గుర్తించారు. ఈ ప్రాంతాలు సాధారణంగా ఎగిరే ఉడుతకు అనుకూలమైనవి. ఈ ఆవిష్కరణలు మియార్ లోయ గొప్ప జీవవైవిధ్యాన్ని, హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తయిన ప్రాంతాల్లోని పర్యావరణ వ్యవస్థల గురించి తెలియజేస్తున్నాయి.
![]() |
![]() |