ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలా చట్టాన్ని (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్) రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2006 నుంచి ఉన్న బకాయిలను అప్పటి రిజిస్ట్రేషన్ విలువలతో చెల్లించే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 2006 నుంచి ఉన్న బకాయిలను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వన్ టైమ్ ఆప్షన్ కింద చెల్లించే సదుపాయాన్ల్ని కల్పిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
26 జిల్లా కేంద్రాలలోని ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని ప్రారంభించారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది.మరోవైపు నాలా చట్టం రద్దుతో భూ వినియోగ మార్పిడి సులభమవుతుందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై చర్చిస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆటో మ్యుటేషన్లు సులభతరం చేయడానికి రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను రెవెన్యూ డేటాతో లింక్ చేసినట్లు మంత్రి వివరించారు. మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్, డీటీసీపీతో అనుసంధాన ప్రక్రియను ఏప్రిల్ 15 నాటిికి పూర్తి చేస్తామని అన్నారు. దీని కారణంగా ఆస్తుల క్రయ, విక్రయాల్లో అక్రమాలు తగ్గుతాయని మంత్రి తెలిపారు.
అలాగే రూ.5 వేలు చెల్లించిన వారికి సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఇక ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో పెట్టుకొని సెలవు రోజుల్దోనూు స్తావేజుల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వడంతో మార్చి నెలాఖరులో 3 రోజుల్లో కలిపి రూ.72 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు సత్యప్రసాద్ వివరించారు.
రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఏప్రిల్ నెలాఖరులోగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు, రాష్ట్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలు మారుస్తామని ఇందుకోసం అవసరమైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ద్వారా నిధులు సేకరిస్తామని వివరించారు.
![]() |
![]() |