వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హరీన్‌ధీర తెలిపారు. రెండు వారాల సమయం ఇచ్చి, వారి వివరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చిత్ర పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం 34 ఎకరాలకు పైగా భూమి కేటాయించామని, 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని వారు ప్రతిపాదించారని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా, రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల వ్యవహారంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం కేటాయించిన భూమిని అప్రయోజనం కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. సిసోడియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.
![]() |
![]() |