మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. వంశీ రిమాండ్ ను ఈ నెల 22వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. ఈరోజుతో వంశీ రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులు నేపాల్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు. నేపాల్ లో కోట్లుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. అక్కడి నుంచి వీరు రాత్రి సమయాల్లో సన్నిహితులకు ఫోన్లు చేస్తూ కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నారు. ఈ నలుగురూ నేపాల్ లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
![]() |
![]() |