ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్ టూర్ కు కరుణ్ నాయర్ ను ఎంపిక చేయాలన్న రాయుడు

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 04:35 PM

టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన అరుదైన భారత బ్యాటర్లలో ఒకరైన కరుణ్ నాయర్, సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ తరఫున ముంబై ఇండియన్స్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కరుణ్ నాయర్‌ను రాబోయే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయాలని సూచించారు.ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, దిల్లీ క్యాపిటల్స్ తరఫున 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్, ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి చివరి వరకు పోరాడాడు. మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే, అలాగే 2018 తర్వాత తొలి అర్ధ శతకం నమోదు చేసి తనలోని పోరాట పటిమను మరోసారి నిరూపించుకున్నాడు. జట్టు ఓడినప్పటికీ, నాయర్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది.ఈ ప్రదర్శనపై స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో అంబటి రాయుడు స్పందించాడు. కరుణ్ నాయర్ కష్టాన్ని, పట్టుదలను కొనియాడాడు. "కరుణ్ నాయర్ చాలా కాలంగా కష్టపడుతున్నాడు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థ బలంగా ఉండటం వల్లే ఆటగాళ్లు ఇలా పునరాగమనం చేయగలుగుతున్నారు. అతను తిరిగి భారత జట్టుకు ఆడాలని బలంగా నమ్ముతున్నాడు. నా అభిప్రాయం ప్రకారం, అతను ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావడానికి అర్హుడు. అతనికి అవకాశం ఇవ్వాలి" అని రాయుడు అభిప్రాయపడ్డాడు. జూన్ నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.గతంలో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత, కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. 2022లో "ప్రియమైన క్రికెట్.. దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వు" అంటూ అతను చేసిన ట్వీట్, అతని తాజా ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని పోరాటానికి, అంకితభావానికి ఈ ప్రదర్శన నిదర్శనమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2024-25 దేశవాళీ సీజన్ లో కరుణ్ నాయర్ విధ్వంసం చూస్తే అతడు ఎంత సూపర్ ఫామ్ లో ఉన్నాడో అర్థమవుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో నమ్మశక్యం కాని రీతిలో 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన కరుణ్ నాయర్ తన పరుగుల దాహాన్ని చాటుకున్నాడు. ఇక విదర్భ జట్టు రంజీ టైటిల్ సాధించడంలోనూ కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. 2024-25 రంజీ ట్రోఫీలో 863 పరుగులు చేశాడు. అటు, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 170కి పైగా స్ట్రయిక్ రేట్ తో 255 రన్స్ చేశాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com