ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తమ జట్టు విఫలమైనందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే బాధ్యతను నాదే అన్నాడు. పటిష్ట పంజాబ్ బ్యాటర్లను తమ బౌలర్లు అద్బుత రీతిలో కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. తన తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని అంగీకరించాడు. బౌలర్లు ఎంతో కష్టపడినా.. చెత్త బ్యాటింగ్ వల్ల పంజాబ్ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.''మైదానంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఓటమి అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని. షాట్ ఎంపికలో పొరపాటు చేశాను. అయితే, అదృష్టవశాత్తూ బాల్ స్టంప్స్‌ను మిస్ అయింది. కానీ లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో నాకు స్పష్టత లేదు.అంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇచ్చిన తర్వాత మరో ఎండ్‌లో ఉన్న అంగ్‌క్రిష్‌తో చర్చించాను. అతడు కూడా అంపైర్స్ కాల్ నిజమవుతుందేమోనని చెప్పాడు. అందుకే ఆ సమయంలో నేను చాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. నాకు కూడా పూర్తి స్పష్టత లేదు కాబట్టి రివ్యూకు వెళ్లలేదు.నిర్లక్ష్య ఆట తీరు వల్లే ఓటమి....మా బ్యాటింగ్ విభాగం ఈ రోజు అత్యంత చెత్తగా ఆడింది. సమిష్టిగా విఫలమయ్యాం. బౌలర్లు ఎంతో కష్టపడి పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కానీ మేము మాత్రం వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా చేశాం. మా నిర్లక్ష్య ఆట తీరే మా ఓటమికి కారణం.ఇప్పుడు నా మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నాయి. సులువుగా ఛేదించగల లక్ష్యాన్ని కూడా మేము దాటలేకపోయాం. మా వాళ్లతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా సగం టోర్నీ మిగిలే ఉంది. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి'' అని అజింక్య రహానే పేర్కొన్నాడు.
![]() |
![]() |