రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరుగారుస్తూ, రాజకీయ కక్షసాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావుగా వాడుతున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనాన్ని ప్రజలు ముందు పెట్టేందుకు వైయస్ఆర్‌సీపీ ఒక కార్యాచరణను సిద్దం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
![]() |
![]() |