రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్ల లక్ష్యం పూర్తయిపోయిందంటూ సిబ్బంది ధాన్యం తీసుకోవడంలేదు. మరి పండించిన పంటను ఏం చేయాలి..? ప్రభుత్వం ప్రకటించిన విధంగా పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిందే. అప్పటిదాకా ఆందోళన విరమించేది లేదు అంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, చాగల్లు మండలాల రైతులు సోమవారం రోడ్డెక్కారు. కొవ్వూరు, గుండుగొలను జాతీయ రహదారిపై గామన్ బ్రిడ్జి టోల్‌ప్లాజా సమీపంలో ధాన్యం ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి ఆందోళన చేపట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా సుమారు రెండున్నర గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. పంట మొత్తం కొనుగోలు చేస్తామని జేసీ, ఆర్డీవోలు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన ధాన్యం ట్రాక్టర్లను తొలగించి ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరించాలని కోరారు. పోలీసులు రైతులను బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. అయినా వారు తమ సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ రైతులను చూసి కారు దిగి వచ్చి విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
![]() |
![]() |