అనంతపురం మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య (93) సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. బళ్లారి నగరంలోని దరూరు పుల్లయ్య కాంపౌండ్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం బళ్లారి నుంచి కంప్లి కొట్టాల వద్దనున్న పొలాన్ని చూడటానికి కారులో వెళ్లారు. పొలం చూసి ఇంటికి వస్తుండగా కంప్లిలో రోడ్డు పక్కన ఉన్న స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగారు. అక్కడే కుప్పకూలిపోయి మరణించారు. ఆయన మృతదేహాన్ని బళ్లారిలోని ఇంటికి తరలించారు. దరూరు పుల్లయ్య సొంతూరు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. మద్రా్‌సలో లా పూర్తి చేసిన ఆయన... ఉరవకొండ పంచాయతీ సమితి ప్రెసిడెంటుగా 1968 నుంచి 78 వరకూ చేశారు. రెండు దఫాలు... 1977, 1980 ఎన్నికల్లో పుల్లయ్య అనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేశారు. పుల్లయ్య మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం బళ్లారిలోని దరూరు పుల్లయ్య కాంపౌండ్‌లో ఉంచారు. ఆయనకు భార్య సత్యవతి, ఆరుగులు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నెల 14వ తేదీ, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘం నేతలు సంతాపం తెలిపారు.
![]() |
![]() |