జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీకి చెందిన ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఈ వివాదంలో పాకిస్థాన్‌కు టర్కీ బాహాటంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జేఎన్‌యూ తీసుకున్న ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది.జేఎన్‌యూ, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయం మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు, అంటే 2028 ఫిబ్రవరి 2 వరకు అమల్లో ఉండాల్సిందని జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. అయితే, బుధవారం నాడు జేఎన్‌యూ తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది."జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో జేఎన్‌యూ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేయబడింది. జేఎన్‌యూ దేశానికి అండగా నిలుస్తుంది" అని ఆ పోస్టులో స్పష్టం చేసింది.భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం, దుష్ప్రచారం చేస్తుందన్న ఆరోపణలపై టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ 'టీఆర్టీ వరల్డ్' ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన రోజే జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో భారత్‌లో టర్కీ ఉత్పత్తులు, సేవలను బహిష్కరించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది.'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా టర్కీ, అజర్‌బైజాన్‌లు వ్యవహరించిన తీరు పట్ల నిరసనగా, ఆ దేశాలకు వెళ్లేందుకు భారతీయ పర్యాటకులు పెద్ద ఎత్తున తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని, కొత్త బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థలు మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్ వెల్లడించాయి
![]() |
![]() |