ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయి పేరుతో యువకుడితో చాట్.. పక్కాగా ట్రాప్ చేసి

Crime |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 11:29 PM

గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాక్‌కు 'హాయ్' అంటూ మెసేజ్. అది చూసిన సదరు యువకుడు కాస్త ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యాడు. డీపీ చూస్తే అందమైన అమ్మాయి ఫోటో ఉంది. అమ్మాయి ఎవరబ్బా.. అని ఆలోచిస్తూనే మెసేజ్‌కు రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత అట్నుంచి యోగక్షేమాలు అడగటం.. కొద్ది రోజుల్లోనే చనువుగా చాట్ చేసుకోవటం మెుదలైంది. ఓ రోజు నిన్ను కలవాలనుందంటూ అట్నుంచి మెసేజ్. అది చూసిన మనోడు.. థ్రిల్ ఫీలయ్యాడు. తాను చాట్ చేస్తున్న అమ్మాయిని కలవబోతున్నానని ఆనందంలో తేలిపోయాడు. అయితే అసలు విషయం గుర్తించలేకపోయాడు. తనన ఎవరో ట్రాప్ చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేక చిత్ర హింసలకు గురయ్యాడు.


వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ అమాయక యువకుడని కొందరు దండగులు దారుణంగా మోసం చేశారు. వాట్సాప్‌లో ఓ అందమైన అమ్మాయి పేరుతో వాట్సాప్ చాట్‌ చేసి పక్కాగా ట్రాప్ చేశారు. ఈ నెల 11న కరీంనగర్‌ బస్టాండ్‌కు రప్పించి తెలివిగా కిడ్నాప్ చేశారు. తమను తాము ఆ అమ్మాయి పంపిన మనుషులమని నమ్మబలికారు. వారి మాయమాటలు నమ్మి వారితో వెళ్లిన ఆ యువకుడికి అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది.


సందీప్, ప్రణయ్, రెహాన్ అనే ఆ ముగ్గురు దుండగులు అతడిని కరీంనగర్ శివారులోని వెలిచాల గ్రామ సమీపంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ అతడిని బంధించ దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. రూ. 50 వేలు ఇస్తేనే వదిలేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ యువకుడు తన వద్ద ఉన్న రూ. 10 వేలు వారికి ఇచ్చాడు. మరో రూ.12 వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. ఆ దుర్మార్గుల నుండి ఎలాగోలా తప్పించుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని వివరించాడు.


వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా స్పందించారు. యువకుడ్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన సందీప్, ప్రణయ్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడు రెహాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్లు, చాటింగ్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారి మాటలు నమ్మి ట్రాప్‌లో చిక్కితే ఘోరంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అమ్మాయి ఫోటో కనిపించగానే అలా ఎలా వెళ్లాడంటూ కొందరు బాధితుడిని తప్పు బడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com