విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటం అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్లు తగినంత సంఖ్యలో హాజరుకాకపోవడమే దీనికి కారణం. ఈ పరిణామంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరగాల్సిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 74 మంది సభ్యులకు గాను కేవలం 54 మందే హాజరయ్యారు. ఎన్నిక నిర్వహణకు కనీసం 56 మంది సభ్యుల కోరం అవసరం కాగా, ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడింది. దీంతో అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయినప్పటికీ, పలువురు గైర్హాజరు కావడం గమనార్హం.ఈ పరిణామాలపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఈ ఎన్నికకు గైర్హాజరైన కార్పొరేటర్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. కొందరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడవద్దని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.
![]() |
![]() |