ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు పాల్గొనబోవడం లేదంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చిచెప్పారు. టీమిండియా ఆసియా కప్ లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగినట్లు వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు.ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల గురించి బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని, ఎటువంటి నిర్ణయాలూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "ప్రస్తుతం బీసీసీఐ మొత్తం దృష్టి ఐపీఎల్ 2025 సీజన్, ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌పైన మాత్రమే ఉంది. ఆసియా కప్ విషయంపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదు" అని సైకియా వివరించారు.ఏసీసీ టోర్నమెంట్ల గురించి భవిష్యత్తులో చర్చలు జరిపినప్పుడు, సరైన సమయంలో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను, కల్పిత వార్తలను నమ్మవద్దని క్రికెట్ అభిమానులకు ఆయన సూచించారు.
![]() |
![]() |