ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు అత్యున్నత గౌరవం

international |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 08:14 PM

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ప్రతిష్టాత్మకమైన ఫీల్డ్ మార్షల్ ర్యాంకును కల్పించే ప్రతిపాదనకు ఆ దేశ మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర కల్పించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమై.. దాడులు జరిగిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణలో జనరల్ అసిమ్ మునీర్ చూపిన అసాధారణ పాత్రకు గుర్తింపుగా ఈ పదోన్నతి కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వ రంగ టెలివిజన్ ఛానల్ పీటీవీ తెలిపింది.


పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని.. అయితే తమ దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే.. తమ జాతీయ ప్రతిష్టను, ప్రజల శ్రేయస్సును కాపాడుకోవడానికి పూర్తి బలంతో స్పందిస్తామని మే 5వ తేదీన రావల్పిండిలో అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను జియో టీవీ ఉటంకించింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను.. పాక్ ఆర్మీ చీఫ్ నేరుగా పర్యవేక్షించరు.


 పాకిస్తాన్‌లోని 3 ప్రధాన సాయుధ దళాలకు ముగ్గురు అధిపతులు ఉంటారు. అసిమ్ మునీర్ కేవలం పాకిస్తాన్ ఆర్మీకి మాత్రమే చీఫ్‌గా వ్యవహరిస్తారు. పాకిస్తాన్ వైమానిక దళానికి అధిపతిగా ఎయిర్ చీఫ్ స్టాఫ్.. పాకిస్తాన్ నేవీకి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అధిపతిగా ఉంటారు. అయితే ఈ ముగ్గురు చీఫ్‌లు.. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఛైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీజేసీఎస్‌సీ) నాయకత్వం వహిస్తారు. ఈ సీజేసీఎస్‌సీ త్రివిధ దళాలను సమన్వయ పరుస్తూ.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.


అయితే పాక్ ఆర్మీ చీఫ్.. తన సైన్యాన్ని పర్యవేక్షించినట్లుగా.. ఎయిర్‌ఫోర్స్‌ను నేరుగా పర్యవేక్షించరు. ఇటీవల భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ.. తాము గెలిచేశామని ఆ దేశం గొప్పలు చెప్పుకుంది. అంతటితో ఆగకుండా విజయోత్సవ ర్యాలీలు కూడా తీసి.. ప్రపంచం ముందు నవ్వులపాలైంది. భారీగా సైనిక, ఆస్తి, ఆయుధ నష్టం జరిగినా.. వాటిని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి ర్యాలీలు తీసిందని ప్రపంచ దేశాలకు అర్థమైంది. అయితే భారత్‌పై దాడులు చేసి విజయం సాధించామని చెప్పడం కంటే ముందు.. అసలు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన దాడులను కనీసం అడ్డుకోవడానికి కూడా పాకిస్తాన్ చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు.


ఇక భారత్ చేసిన దాడులను అడ్డుకునేందుకు అంతో ఇంతో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ప్రయత్నాలు చేసింది. భారత్ చేసిన దాడుల్లో అడ్డుకోవడంలో గానీ.. తిరిగి దాడి చేయడంలో గానీ పాకిస్తాన్ ఆర్మీ పాత్ర లేనే లేదు అనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌కు ఇలాంటి ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించి ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ జోకర్‌గా మారింది.


ఫీల్డ్ మార్షల్ అనేది సైన్యంలో అత్యున్నత సైనిక హోదా. సాధారణంగా అసాధారణమైన సైనిక విజయాలు.. యుద్ధంలో నిర్ణయాత్మక విజయం సాధించినప్పుడు గౌరవప్రదంగా చీఫ్‌లకు ఈ ఫీల్డ్ మార్షల్ హోదా ఇస్తారు. ఈ ఫీల్డ్ మార్షల్‌ అపారమైన ప్రతిష్ట, గౌరవాన్ని కలిగి ఉంటుంది. దేశానికి జీవితకాలం చేసిన విశిష్ట సేవకు గుర్తుగా దీన్ని ప్రదానం చేస్తారు. నేవీలో ఫీల్డ్ మార్షల్‌కు సమానమైన హోదా ఫ్లీట్ అడ్మిరల్ కాగా.. ఎయిర్‌ఫోర్స్‌లో మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ ప్రదానం చేస్తారు. ఫీల్డ్ మార్షల్ అనే పదం మధ్యయుగ కాలం నుంచి వచ్చింది.


భారత్‌లో ఫీల్డ్ మార్షల్


భారత సైన్యంలో ఫీల్డ్ మార్షల్ అనేది అత్యున్నత హోదా. ఇది ఫైవ్ స్టార్ ర్యాంకు. ఈ హోదా ఎంతో గౌరవప్రదమైంది. ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంకు పొందిన వారు మరణించే వరకు కూడా దేశానికి సేవలు అందిస్తున్న అధికారులుగానే పరిగణిస్తారు. ఇప్పటివరకు కేవలం ఇద్దరు భారత సైనిక అధికారులు మాత్రమే ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంకును పొందారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో గెలిచిన తర్వాత.. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ.. జనరల్ సామ్ మానెక్‌షాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకు ఇచ్చారు. ఆ యుద్ధంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి.. విజయం సాధించిన జనరల్ సామ్ మానెక్‌షాకు 1973 జనవరి 1వ తేదీన ఫీల్డ్ మార్షల్ ర్యాంకును ప్రదానం చేశారు. దీంతో ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్‌గా ఆయన నిలిచారు. ఇక మన దేశంలో రెండో ఫీల్డ్ మార్షల్ ర్యాంకును దక్కించుకున్న వ్యక్తి జనరల్ కేఎం కరియప్ప. 1986లో జనరల్ కేఎం కరియప్పకు ఈ గౌరవం దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com