కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి వాడీవేడిగా వాదనలు సాగాయి.తొలుత ఇవాళ తొలిసారి విచారణ చేపట్టిన సీజేఐ బీఆర్ గవాయ్ ప్రత్యేక పరిస్ధితుల్లో తప్ప పార్లమెంట్ ఆమోదించిన చట్టాలపై తాము జోక్యం చేసుకోబోమని తెలిపారు.అనంతరం ఈ చట్టాన్ని సవాల్ చేయడానికి తగిన కారణాల్ని పిటిషనర్ల న్యాయవాదులు ఏకరువు పెట్టారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ వాదనలు వినిపించారు.కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టం కారణంగా సెంట్రల్ వక్ఫ్ బోర్డులో ముస్లింలు మైనార్టీలుగా మారుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. 22 మంది సభ్యుల్లో 10 మంది ముస్లింలు ఉంటే మరో 10 మంది న్యాయనిపుణులు, బ్రూరోక్రాట్ ఉన్నారన్నారు. అలాగే కేంద్ర మైనార్టీ మంత్రి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న హిందూ, సిక్కు మత సంస్థల్లో హిందూయేతరులు కానీ ముస్లింలు కానీ ఒక్కరు కూడా లేరన్నారు. వక్ఫ్ ఆస్తిని సృష్టించడం సెక్యులర్ కాకపోవచ్చని, కానీ ముస్లింలు దేవుడికి సమర్పించుకునే ఆస్తి అన్నారు.
అలాగే పిటిషనర్ల తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా తన వాదన వినిపించారు. ఇందులో దరఖాస్తుదారుడు వక్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం ఎప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందేనన్నారు. ఇది కేవలం భయాన్ని కలిగించడానికే అన్నారు. ప్రతి మతంలో మత సంస్థలు ఉన్నాయని, మీరు గత 5 సంవత్సరాలుగా దానిని ఆచరిస్తున్నారని నిరూపించమని ఏ మత సంస్థ మిమ్మల్ని అడుగుతుందని ప్రశ్నించారు. మతం యొక్క రుజువును ఎవరు అడుగుతారన్నారు. ఈ చట్టం ప్రకారం వివాదం తలెత్తిన వెంటనే ఆస్తి వక్ఫ్ హోదాను కోల్పోతుందని గుర్తుచేశారు.
మతపరమైన చట్టంలో మతాన్ని పునర్నిర్వచించడం ఇదే మొదటిసారి అని మరో పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తెలిపారు. మనది లౌకిక దేశమని, తన క్లయింట్లలో ఒకరు సిక్కు అని, తాను వక్ఫ్‌కు తోడ్పడాలనుకుంటున్నానని తెలిపారు. వక్ఫ్ గా గుర్తింపు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు కొత్త చట్టం ప్రకారం ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఎవరైనా ఇస్లాంను ఎలా ఆచరిస్తారని సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మది అడిగారు. మీరు రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేస్తారా అని తనను అడుగుతారా ? ఆపై ఎవరైనా నేను తాగుతానా అని అడుగుతారని ప్రశ్నించారు. అనంతరం ఈ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
![]() |
![]() |