దేశీయ మార్కెట్లో ఏషియన్ పెయింట్స్ షేర్లు అమ్మకానికి వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) జూన్ 12న ఏషియన్ పెయింట్స్ కంపెనీకి చెందిన 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 2,201 చొప్పున విక్రయించింది. ఈ భారీ బ్లాక్ డీల్ విలువ ఏకంగా రూ. 7,703.5 కోట్లు. దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. ఈ లావాదేవీ ద్వారా మల్టీబ్యాగర్ రిటర్న్స్ పొందారు. అయితే, ఈ షేర్లను కొనుగోలు చేసిన వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ బ్లాక్ డీల్ తర్వాత, ఏషియన్ పెయింట్స్ షేర్లు గురువారం సెషన్లో ఇంట్రాడేలో 2 శాతం కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, దలాల్ స్ట్రీట్‌లో మొత్తం అమ్మకాలు జరుగుతున్న క్రమంలో ఆఖర్లో నష్టపోయింది. చివరకు బీఎస్‌ఈలో 0.43 శాతం పెరిగి రూ. 2,218 వద్ద ముగిసింది.
అంబానీ తెలివైన పెట్టుబడి.. రూ. 500 కోట్లతో 7,700 కోట్లు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ సంస్థ సిద్ధాంత్ కమర్షియల్స్ లిమిటెడ్ ద్వారా ఏషియన్ పెయింట్స్‌లో 87 లక్షల ఈక్విటీ షేర్లు ఇంకా మిగిలి ఉన్నాయని రిలయన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ లాభాలను చూస్తే, 2008 జనవరిలో రిలయన్స్ తీసుకున్న ఒక తెలివైన పెట్టుబడి గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, లెమాన్ బ్రదర్స్ పతనం కారణంగా మార్కెట్లు తీవ్ర గందరగోళంలో ఉన్నప్పుడు, రిలయన్స్ కేవలం రూ. 500 కోట్లకు ఏషియన్ పెయింట్స్‌లో 4.9 శాతం వాటాను కొనుగోలు చేసింది.
గత 2 సంవత్సరాలలో ఏషియన్ పెయింట్స్ షేర్లు 30 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ఈ కాలంలో ఇది అత్యంత పేలవమైన పనితీరు కనబరిచిన బ్లూచిప్ స్టాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు మార్కెట్లో తిరుగులేని స్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్‌కు ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతుతో కొత్తగా ప్రవేశించిన బిర్లా ఓపస్ పెయింట్స్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది.
ఎలరా సెక్యూరిటీస్ ప్రకారం, FY25లో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గింది. ఈ క్షీణత స్పష్టంగా, వేగంగా జరుగుతోంది. "ఒక బ్రాండ్‌గా, మేము పోటీని మరింత స్థిరమైన మార్గంలో ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని బలంగా నమ్ముతున్నాము" అని ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ సింగల్ ఇటీవల పెట్టుబడిదారులతో అన్నారు.
అయితే, కంపెనీకి ప్రతికూల పరిస్థితులు ఇంకా ఉన్నాయి. గత నాలుగు త్రైమాసికాలుగా ఆదాయ వృద్ధి నెమ్మదించినట్లు కంపెనీ పేర్కొంది. పట్టణ డిమాండ్ తగ్గడం దీనికి కారణాలుగా పేర్కొంది. ముడి పదార్థాల ఖర్చులు తగ్గినప్పటికీ, అధిక రీబేట్లు, పెరిగిన పోటీ కారణంగా స్థూల మార్జిన్‌లు సంవత్సరానికి తగ్గడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే బ్రోకరేజీలు కూడా ఏషియన్ పెయింట్స్ ఆదాయ అంచనాల్ని తగ్గించేశాయి. రేటింగ్ కూడా తగ్గించాయి. ఏదేమైనా తాజాగా షేర్ల విక్రయం ద్వారా.. అంబానీకి కాసుల పంట పండింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa